Nov 16,2022 15:41

జైపూర్‌ :   రాజస్థాన్‌ సీనియర్‌ నేత అజయ్  మాకెన్‌ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బుధవారం అధిష్టానానికి పంపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గత సెప్టెంబర్‌లో ఎమ్మెల్యేలతో సహా తిరుగుబాటు ప్రకటించిన రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌గెహ్లాట్‌పై అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై  అజయ్ మాకెన్‌ అసహనానికి గురయ్యారని, దీంతో ఇన్‌చార్జ్‌ పదవికి రాజీనామా చేసినట్లు ఆ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు అధిష్టానం ఎంపిక చేసిన గెహ్లాట్‌ చివరి నిమిషంలో ముఖ్యమంత్రి పదవిని వదులుకునేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే. సుమారు 90కి పైగా ఎమ్మెల్యేలతో గెహ్లట్‌ తిరుగుబాటు ప్రకటించారు. కీలక పార్టీ సమావేశానికి గైర్హాజరు కావడంతో పాటు వారి రాజీనామాలను సమర్పించేందుకు స్పీకర్‌ నివాసానికి వెళ్లారు. దీంతో గెహ్లాట్‌ పై అధిష్టానం చర్యలు తీసుకుంటుందని అజయ్  మాకెన్‌ భావించారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. దీంతో ఆయన రాజస్థాన్‌ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. భారత్‌ జోడోయాత్రపై కాంగ్రెస్‌ చేపట్టిన సమీక్ష సమావేశానికి కూడా మాకెన్‌ దూరంగా ఉన్నారు. రాజస్థాన్‌లో రాజకీయ అనిశ్చితికి ముగింపు పలకాలని సచిన్‌పైలెట్‌ అధిష్టానాన్ని కోరిన రెండు రోజుల అనంతరం ఈ ఘటన జరగడం గమనార్హం.