
న్యూఢిల్లీ : ''మహిళలు ఇప్పటికీ లైంగిక వేధింపులకు గురవుతున్నారు'' అన్న రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై ఢిల్లీ పోలీస్ ఉన్నతాధికారులు ఆదివారం ఆయన నివాసానికి చేరుకున్నారు. భారత్ జోడో యాత్ర సమయంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. లైంగిక వేధింపులకు సంబంధించి ఆయనను సంప్రదించిన మహిళల వివరాలను అందించాలని పోలీసులు మార్చి 16న రాహుల్‌గాంధీకి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. శ్రీనగర్‌లో భారత్ జోడోయాత్ర నిర్వహిస్తున్న సమయంలో ఇప్పటికీ స్త్రీలపై వేధింపులు జరుగుతున్నాయని రాహుల్‌గాంధీ పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఆ మహిళల వివరాలను తెలుసుకుని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. రాహుల్‌గాంధీ వివరాలు ఇవ్వకపోతే.. అతనికి మరో నోటీసు ఇవ్వబడుతుందని ఢిల్లీ పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి.
రాహుల్‌గాంధీకి నోటీసులు జారీ చేయడంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితుల పేర్లను వెల్లడించమని ఢిల్లీ పోలీసులు అతనిని బలవంతం చేయలేరని మండిపడింది.