
- సమస్యలను పరిష్కరించండి
- పట్టు రైతు సమ్మేళన సభను అడ్డుకొని నిరసన తెలిపిన రైతులు
ప్రజాశక్తి-హిందూపురం : పట్టు రైతుల సమస్యలను పరిష్కరించాలని గత నాలుగు సంవత్సరాలుగా స్థానిక అధికారుల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు, స్థానిక ప్రజా ప్రతినిధుల నుండి ముఖ్యమంత్రి వరకు సమస్యలను వివరించినప్పటికీ వాటికి పరిష్కారం చూపకుండా పట్టు రైతులకు ఏదో మేలు చేశామన్నట్టు పట్టు రైతు సమ్మేళనం నిర్వహించడంపై పట్టు రైతులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసి పట్టు రైతు సమ్మేళన సభను అడ్డుకున్నారు. సోమవారం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని టీటీడీ కళ్యాణమండపంలో కేంద్ర పట్టు పరిశ్రమ శాఖ, రాష్ట్ర పట్టు పరిశ్రమ శాఖ సంయుక్తంగా రాష్ట్రస్థాయి పట్టు రైతుల సమ్మేళనము-2023 సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాయలసీమ వ్యాప్తంగా ఉన్న ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు ఉమ్మడి కర్నూలు, చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు రైతులు, కేంద్ర రాష్ట్ర పట్టు పరిశ్రమ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. సభ ప్రారంభ సమయంలోనే పట్టు రైతులందరూ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో బైవోల్టీన్ పండించే పట్టు రైతులకు కేజీకి రూ.50 చొప్పున ప్రోత్సాహం అందించే విధంగా చర్యలు చేపట్టారన్నారు. అయితే గడిచిన నాలుగు సంవత్సరాల నుంచి ఈ ప్రోత్సాహం ఒక్క రైతుకు అందలేదన్నారు. దాదాపు రూ.50 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి బైవోల్టీన్ పట్టు రైతులకు అందాల్సి ఉందన్నారు. ప్రతి రైతుకు రూ. 2 లక్షల వరకు ఇన్సెంటివ్ రూపంలో రావాల్సి ఉందన్నారు. దీంతో పాటు పట్టు రైతులు నిర్మాణం చేసుకున్న షెడ్లు, మొక్కల పెంపకానికి వెచ్చించిన పెట్టుబడిలో ప్రభుత్వం నుంచి రావలసిన 75 శాతం వాటా ఇంతవరకు అందలేదన్నారు. ఇలా ప్రభుత్వంతో పాటు పట్టు పరిశ్రమ శాఖ అధికారుల వరకు పట్టు రైతులను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పట్టు రైతులు ఆనంద రంగారెడ్డి, చైతన్య గంగిరెడ్డి, ధనాపురం వెంకటరామిరెడ్డి, నవీన్, జయరామిరెడ్డి తదితరులు ఆ గ్రహాన్ని వ్యక్తం చేశారు. పట్టు రైతుల సమస్యలను పరిష్కరించి పట్టు రైతు సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించాలని పట్టుబట్టారు. నిరసన తెలుపుతున్న రైతులకు పట్టు పరిశ్రమ శాఖ అధికారులు ఎంత నచ్చజెప్పినప్పటికీ చివరికి పట్టు రైతులు వినలేదు. సభ ముగిసిందని అధికారులు ప్రకటించారు. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం ఉన్న కొంతమంది రైతులతో కేంద్ర, రాష్ట్ర పట్టు పరిశ్రమ శాఖ అధికారులు కొంతమంది రైతులకు, అధికారులకు సమ్మేళన కార్యక్రమంలో భాగంగా సన్మానాలు చేసి మమ అనిపించారు.