Sep 27,2021 16:16

న్యూఢిల్లీ :  జైలులో ఉన్న ప్రత్యర్థిని చంపేందుకు మరో గ్యాంగ్‌స్టర్‌ యత్నించడం, ఎలా హత్య చేయాలన్న వివరాలను ఫోన్‌లో చెప్పడం వంటివి సాధారణంగా సినిమాల్లో చూస్తుంటాం. అయితే యధార్థంగా అటువంటి ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. ఇటీవల ఢిల్లీలోని రోహిణీ కోర్టులో గ్యాంగ్‌స్టర్‌ను కాల్చి చంపిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ హత్యకు పథకం రచించడంతో పాటు తీహార్‌ జైలులో ఉన్న మరో గ్యాంగ్‌స్టర్‌ ఫోన్‌లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వారికి వివరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 30 క్రిమినల్‌ కేసుల్లో నిందితుడు, గ్యాంగ్‌స్టర్‌ జితేంద్రమాన్‌ గోగిని విచారణ కోసం భారీ భద్రత మధ్య శుక్రవారం రోహిణీ కోర్టులో హాజరుపరిచారు. అదే సమయంలో లాయర్‌ దుస్తుల్లో వచ్చిన ఇద్దరు వ్యక్తులు కోర్టులోనే కాల్పులు జరపగా.. గోగితో పాటు అతని అనుచరులు ఇద్దరు మరణించారు. ఇద్దరు షూటర్లు రాహుల్‌ త్యాగి, జగదీప్‌ జగ్గాలను కాల్చి చంపగా.. మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, గొగిపై కాల్పులు వెనుక అతని ప్రత్యర్థి టిల్లు తాజ్‌పురియా ఉన్నట్లు పోలీసులు నిర్థారించారు. అయితే గోగి హత్యకు పాల్పడిన రాహుల్‌, జగదీప్‌లతో జైలులో ఉన్న టిల్లు నిరంతరం ఫోన్‌లో టచ్‌లో ఉన్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఈ ఘటన మరో భద్రతా లోపాన్ని ఎత్తి చూపింది. గోగిని హత్య చేసే వరకు మినిట్‌ టు మినిట్‌ ప్రత్యక్ష ప్రసారమైనట్లు పోలీసులు తెలిపారు. నిందితులను కోర్టుకు ఎంత దూరంలో ఉన్నారు, ఎప్పటికి చేరుకుంటారు తదితర వివరాలను నిందితులను అడిగి తెలుసుకున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. అరెస్టయిన మరో ఇద్దరు నిందితులు వినరు, ఉమాంగ్‌లతో కూడా ఫోన్‌లో సంభాషించినట్లు తెలిపాయి. నిందితులు కోర్టులో భారీ పోలీస్‌ బందోబస్తు మధ్య ఉన్నారని.. అక్కడి నుండి తప్పించుకోవడం సాధ్యం కాదని వెల్లడించినట్లు తెలిపాయి. కోర్టు కాంప్లెక్స్‌ నుండి కోర్టు గది వరకు నిందితులు ప్రవేశించడంతో భద్రతా లోపం ఉందని... దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గొగి, టిల్లులు కాలేజీలో స్నేహితులని, అనంతరం వారు రెండు వర్గాలుగా ఏర్పడి పలు దోపిడీలకు యత్నించినట్లు వివరించారు. దశాబ్దాలుగా ఇద్దరి మధ్య వైరం కొనసాగిందని.. పలు హత్యలకు దారితీసినట్లు తెలిపారు.