Feb 06,2023 07:43

అతడు చిత్రం గీయటం మొదలెట్టాడు
వొక తెల్లని కాన్వాస్‌ పైన.

యుగయుగాల్నించీ రాజుకుంటోన్న రాజ్యాల్నీ,
రాజ్య సరిహద్దుల్నీ,
భీకర యుద్ధ సన్నివేశాల్నీ,
మృత్యులోయల్తో వున్న అమోఘమైన పర్వతాల్నీ,

యెరుపునీ, నౌకల్నీ, ద్వీపాల్నీ,
చిట్టి చేపల్ని మింగేసిన తిమింగాల్నీ,
చీకటికి, మృత్యువుకీ హామీనిచ్చే నక్షత్రాల్నీ,
నలుపు రంగు తోడేల్నీ,
యెరుపు రంగు సింహాల్నీ,
గుర్రాల్నీ, గుర్రపు డెక్కల్లాంటి గ్రంధాల్నీ,
అడవుల్నీ, మనుష్యుల్నీ,
మనుష్యులు తవ్వుకున్న లోయల్నీ, ఫకీరుల్నీ,
యింద్రధనుస్సులోని రంగుల్నీ,
యోధుల్నీ, సాధువుల్నీ,
పసి పాపల్నీ, నలుపులాంటి పాపాల్నీ,
అంతా అందంగా
చిత్రించేసి విశ్రమించాడు.

తను చనిపోయే కొద్ది క్షణాల ముందు,
తన చిత్రాన్ని చూసుకున్నాడు.

అస్తవ్వస్తమైన గీతలూ,
రంగుల్తో వున్న ఆ చిత్రం,
మనిషి ముఖాన్ని పోలి వుంది.

- శ్రీధర్‌ చందుపట్ల
949 3122 742