Jul 21,2021 17:28

న్యూఢిల్లీ : కోవిడ్‌ మొదటి దశ కంటే రెండో దశలో పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపింది. ఇక మూడో దశలో.. మరింత ఎక్కువగా ప్రభావం చూపనుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూడో దశలో పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపనుందని లేడీ హార్డింగ్‌ మెడికల్‌ కాలేజీ పీడియాట్రిక్స్‌ విభాగం డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ స్పష్టం చేశారు. మహమ్మారి వల్ల.. ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాల్లోని పిల్లలపై దాదాపు సంవత్సరం నుంచే ఆ ప్రభావం పడిందని, థర్డ్‌వేవ్‌ వస్తే... ఈ పిల్లలపై మళ్లీ వైరస్‌ ప్రభావం చూపనుందన్న ఊహాగానాలు భయాందోళనలకు గురిచేస్తున్నాయని ఆయన అన్నారు. వైరస్‌కి చిన్నా, పెద్దా అనే తేడా లేదని, అందరిపైనా ఆ ప్రభావం పడనుందని ఆయన హెచ్చరించారు.
మూడోదశ ప్రభావానికి గురైన పిల్లల అలవాట్లలో స్పష్టమైన మార్పు కనిపిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అంటే... పిల్లలు తీసుకునే ఆహారం, నిద్రించే సమయం.. సరైన ఏకాగ్రత లేకపోవడం, దేనిమీద శ్రద్ధ పెట్టకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని అన్నారు. అలాగే కొంతమంది పిల్లల్లో విపరీతమైన కోపం, లేక మౌనంగా ఉండిపోవడం, మరికొంతమంది పిల్లలు హైపర్‌ యాక్టివ్‌గా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు. పిల్లల్లో వచ్చే ప్రతి మార్పునూ తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు గమనించాలని అన్నారు. ముఖ్యంగా పిల్లల్లో ఉండే ఒత్తిడి, ఆందోళనలను దూరం చేసేవిధంగా కుటుంబ సభ్యులు వారికి సహకరించాలని సూచించారు. అయితే రాబోయే కొన్నినెలల్లో అయినా పెద్దలకు టీకా వేస్తారు. కానీ... పిల్లలకు మాత్రం ఇప్పటివరకు ఆమోదించిన టీకా లేదు. దీంతో పిల్లలు వైరస్‌ను ఎలా ఎదుర్కొంటారనేది ప్రశ్నార్థంగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఇక టీకా విషయంలో పెద్దలకు మాత్రమే కాదు.. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులకు కూడా కచ్చితంగా టీకా వేయాలి. అలాంటి వారికి టీకా వేయడం వల్ల నవజాత శిశువులను వైరస్‌ సంక్రమణ నుండి కొంతమేరకైనా కాపాడుకోవచ్చన్నారు. కాగా, 20 ఏళ్లలోపు కోవిడ్‌కు గురైన వారు 12 శాతంగా ఉన్నారని ఎన్‌సిడిసి, ఐడిఎస్‌పి డాష్‌ బోర్డు వెల్లడించింది. ఇప్పటివరకు పెద్దలతో పోల్చితే... పిల్లల మరణాల రేటు తక్కువగానే ఉంది.