Jul 02,2022 06:32

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) కేరళ రాష్ట్ర ప్రధాన కార్యాలయంపై గురువారం రాత్రి జరిగిన బాంబుదాడి ప్రజాస్వామ్య సౌధంపై జరిగిన దాడిగా పరిగణించాలి. రాజ్యాంగ హక్కులు, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం అలుపెరగని పోరుసల్ఫిన ఎకె గోపాలన్‌ పేరిట ఉన్న కార్యాలయంపైనే దాడికి తెగించడం దుర్మార్గం. ప్రజాస్వామ్యవాదులందరూ ఈ దాడిని ఖండించాల్సిన అవసరముంది. దాడి వెనకున్న పిరికిపందలకు ప్రజాస్వామ్య విలువలపై ఏమాత్రం గౌరవం లేదని స్పష్టమౌతుంది. దేశంలోనే ఆదర్శనీయమైనరీతిలో సుపరిపాలన అందిస్తున్న కేరళలోని వామపక్ష ప్రజాతంత్ర కూటమి (ఎల్‌డిఎఫ్‌) ప్రభుత్వాన్ని, వామపక్షాలను ప్రధానంగా సిపిఎంను లక్ష్యంగా చేసుకొని కొంతకాలంగా సాగుతున్న కుట్రలు, కుతంత్రాల్లో భాగమే గురువారం రాత్రి జరిగిన బాంబుదాడి. రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు, దాడి జరిగిన తీరు చూస్తుంటే ఈ ముష్కర దాడి వెనుక ఎవరి 'హస్తం' ఉందో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. కన్నూరు జిల్లాలో సరిగ్గా వారం కిందట జైలు నుంచి విడుదలైన ముగ్గురు యువజన కాంగ్రెస్‌ నేతలకు అక్కడి జిల్లా కాంగ్రెస్‌ నాయకత్వం పూల దండలతో ఘన స్వాగతం పలికింది. ఆ ముగ్గురు నేతలూ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై హత్యాయత్నానికి ఒడిగట్టిన కేసులో ప్రధాన నిందితులు. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రినే అంతమెందించేందుకు పక్కా ప్రణాళిక రచించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న దుండగులను ఊరేగించే దుస్థితికి కాంగ్రెస్‌ దిగజారిపోయిందంటే హింసా రాజకీయాల్లో 'హస్త'లాఘవాన్ని అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్‌ నేత, ఎంపీ రాహుల్‌ గాంధీ పర్యటన నేపథ్యంలో ఈ దాడి జరగడం గమనార్హం.
లోక్‌సభకు వేనాడ్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్‌ నియోజకవర్గ కార్యాలయంపై కొన్ని రోజుల కిందట జరిగిన అవాంఛనీయ ఘటనను సిపిఎం ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి, ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తీవ్రంగా ఖండించింది. అయినా, కాంగ్రెస్‌ ధోరణి మార లేదు. 'దేశాభిమాని' పత్రిక కార్యాలయంపైనా దాడికి తెగబడింది. ప్రజా సమస్యలపై నిత్యం పోరాటాలు చేస్తున్న సిపిఎం ఈ దాడిపై శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చిందే తప్ప కాంగ్రెస్‌ తరహాలో ప్రతిదాడులకు పూనుకోలేదు. అధికారం కోసం ఎంతటి అనైతికానికైనా పాల్పడే కాంగ్రెస్‌ లాంటి పాలకపక్షాలకు, అనునిత్యం ప్రజల పక్షాన నిలిచే వామపక్షాలకు ఇదే తేడా. అంతేకాదు అటు ప్రభుత్వంలో కానీ, ఇటు పార్టీ పరంగా కానీ తనపై ఏ చిన్నపాటి విమర్శలొచ్చినా వాటిని సరిదిద్దుకొని ప్రజాస్వామ్యయుతంగా మార్క్సిస్టు పార్టీ ముందుకు సాగుతోంది. కోవిడ్‌ విపత్తులో ప్రతిపక్ష పార్టీల నేతలను తనతోపాటే ఒకే వేదికపై కూర్చుబెట్టుకొని పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించిన ఏకైక ముఖ్యమంత్రిగా పినరయి విజయన్‌ ప్రత్యేకత చాటుకున్నారు. ప్రజాస్వామ్య విలువలకు మార్క్సిస్టు పార్టీ ఇచ్చే ప్రాధాన్యత అది అని ప్రశంసలు వెల్లువెత్తాయి.
కేరళలో వామపక్ష ప్రభుత్వ విజయాలను, మార్క్సిస్టు సైద్ధాంతిక భావజాల విస్తృతిని జీర్ణించుకోలేని మితవాద మతతత్వ శక్తులు కేరళను మతోన్మాద ఆగడాలకు రణక్షేత్రంగా మార్చేందుకు నిరంతరం కుట్రలు కుతంత్రాలు పన్నుతూనే ఉంది. దాంతో కాంగ్రెస్‌ జతకలసి వామపక్ష ప్రభుత్వంపై విషం గక్కుతున్నది. వామపక్షాల కార్యాలయాలను, కార్మిక, ప్రజాసంఘాల కార్యాలయాలను, 'దేశాభిమాని' వంటి ప్రజా పత్రికల కార్యాలయాలపైనా దాడులకు తెగబడుతున్నది. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సమాఖ్య విలువలు గురించి జాతీయస్థాయిలో నీతులు చెప్పే కాంగ్రెస్‌ పార్టీ కేరళలో మాత్రం మతతత్వ శక్తులతో అంటకాగుతూ బిజెపితో అనైతిక బంధాన్ని కొనసాగిస్తున్నది. బిజెపికి బి-టీమ్‌గా కాంగ్రెస్‌ వ్యవహ రిస్తోందన్న విమర్శలనూ ఇటీవల కేరళలో చోటు చేసుకున్న పరిణామాలు మరింత బలం చేకూరుస్తున్నాయి. కానీ ఎర్రజెండాను గుండెలపై హత్తుకున్న నవ కేరళ ప్రజానీకం ఆ కుట్రలను ఎప్పటికప్పుడు చిత్తుచేస్తూవస్తోంది. దీనిని కూడా అదే స్ఫూర్తితో ఎదుర్కొంటారని ఆశిద్దాం.