May 30,2023 22:14

- పార్లమెంటులో వ్యతిరేకంగా ఓటు వేస్తాం
- సంయుక్త మీడియా సమావేశంలో ఏచూరీ, కేజ్రీవాల్‌
- సిపిఎం కేంద్ర కార్యాలయంలో ఆప్‌ నేతల భేటీ

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:ఢిల్లీలో పరిపాలనా వ్యవహారాలపై నియంత్రణకు సంబంధించిన అంశంపై కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ రాజ్యాంగ విరుద్ధమని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. ఈ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆమాద్మీ పార్టీ చేస్తున్న పోరాటానికి తమ పార్టీ మద్దతు ఉంటుందని తెలిపారు. పార్లమెంటులోనూ ఐక్యంగా పోరాడుతామని, ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఓటు వేస్తామని ప్రకటించారు. ఆమాద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని బృందం ఢిల్లీలోని సిపిఎం కేంద్ర కార్యాలయమైన ఎకె గోపాలన్‌ భవన్‌కు విచ్చేశారు. సిపిఎం ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్‌ కరత్‌, బృందాకరత్‌, ఎంఎ బేబీ, ఎ విజయరాఘవన్‌తో కేజ్రీవాల్‌ బృందం సమావేశమైంది. ఈ సమావేశంలో కేజ్రీవాల్‌తో పాటు ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతీషి మర్లెనా, ఎంపిలు సంజరు సింగ్‌, రాఘవ్‌ చద్దా కూడా పాల్గన్నారు.
అనంతరం కేజ్రీవాల్‌, ఏచూరి సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఉల్లంఘిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని ఏచూరి చెప్పారు. ఇది కోర్టు ధిక్కారమే కాకుండా సమాఖ్య వ్యవస్థపై జరిగిన దాడి అని ఆయన విమర్శించారు. సైద్ధాంతిక వైరుధ్యాలు పక్కనబెట్టి రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్‌ తదితర పార్టీలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రాల హక్కులపై కేంద్రం ఎనలేని దాడులకు పాల్పడుతోందనీ, ఆర్డినెన్స్‌ను రాష్ట్రాలపై దౌర్జన్యం చేసేందుకు ఒక మార్గంగా మోడీ సర్కార్‌ భావిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావాలని కోరారు. బిజెపేతర ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు మోడీ ప్రభుత్వం ఎంతకైనా తెగిస్తుందనడానికి ఢిల్లీలో అది తీసుకొచ్చిన ఈ ఆర్డినెన్స్‌ ఒక ఉదాహరణ అని ఏచూరి తెలిపారు.
సుప్రీంకోర్టులో సవాల్‌ చేస్తాం: కేజ్రీవాల్‌
కేంద్రం తీసుకొచ్చిన నిరంకుశ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆప్‌ ప్రభుత్వానికి సిపిఎం మద్దతు తెలియజేసినందుకు కేజ్రీవాల్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. ఈ అంశంపై అన్ని ప్రతిపక్ష పార్టీలు ఏకతాటిపైకి వచ్చి తమకు మద్దతు ఇస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాజ్యసభలో బిజెపికి మెజారిటీ లేదని, ప్రతిపక్షాలు ఏకమైతే ఆర్డినెన్స్‌ను తిప్పికొట్టవచ్చునని పేర్కొన్నారు. ఇందుకు కాంగ్రెస్‌ నేతలు, ఇతర పక్షాల సభ్యులు సిద్ధంగా ఉన్నారా? లేదా? అనేది సమస్య కాదని, ఇది ప్రజాస్వామ్య సమస్య అని కేజ్రీవాల్‌ అన్నారు. ఈ విషయమై తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ రావు, శివసేన నేత ఉద్ధవ్‌ ఠాక్రే, ఎన్సీపి అధినేత శరద్‌ పవార్‌ను కలిశామని కేజ్రీవాల్‌ చెప్పారు. 'ఇది కేజ్రీవాల్‌కు సంబంధించిన సమస్య కాదు..మొత్తం ఈ దేశ ప్రజలది' అని ఆయన అన్నారు. తాము చేస్తున్న న్యాయ పోరాటానికి అన్ని పక్షాలు సహకరించాలని కోరారు.
ఇదీ నేపథ్యం
ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల నియమాకాలు, బదిలీల అంశంపై కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేసే లెఫ్టినెంట్‌ గవర్నరుకు, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి నిత్యం ఘర్షణాత్మక వాతావరణం ఉండేది. దీంతో ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానిదే అంతిమ నిర్ణయమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఆప్‌ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెలువరించి కేంద్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. ఈ తీర్పును ఏమాత్రం జీర్ణించుకోలేని మోడీ సర్కార్‌ ఢిల్లీలో నియామకాలపై అధికారాన్ని లెఫ్టినెంట్‌ గవర్నరుకే కట్టబెడుతూ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘిస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై సిపిఎం సహా ప్రతిపక్షాలన్నీ ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేశాయి. తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటులోనూ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఓటు వేసి తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని కేజ్రీవాల్‌ బిజెపియేతర పక్షాల నేతలతో సమావేశమవుతున్నారు. ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా మద్దతు సమీకరిస్తున్నారు.