ప్రజాశక్తి – కామ్రేడ్ సీతారాం ఏచూరి నగర్ : సిపిఎం రాష్ట్ర మహాసభ వివిధ అంశాలపై మొత్తం 39 తీర్మానాలను ఆమోదించింది. మొదటి రెండు రోజులూ వివిధ అంశాలపై 24 తీర్మానాలపై చర్చించి ఆమోదించగా, సోమవారం మరో 15 తీర్మానాలను ఆమోదించారు. ప్రజలందరి అభివృద్ధే రాష్ట్ర సమగ్రాభివృద్ధి అని మహాసభ పేర్కొంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కేంద్రం తగినన్ని నిధులు కేటాయిం చాలని సోమవారం మహాసభ తీర్మానించింది. స్థానిక వనరులను ఉపయోగించి స్థానికంగా పరిశ్రమలను పెట్టాలని; కార్పొరేట్లకు భూములూ, ప్రకృతి వనరులను కట్టబెట్టటం వల్ల ప్రజల అభి వృద్ధి జరగదని పేర్కొంది. పేదలకు భూపంపకం, విద్య వైద్యరంగాల్లో ప్రభుత్వ సేవలను మెరుగు పర్చటం, ప్రత్యేక హోదాతో సహా రాష్ట్ర విభజన హామీల అమలును సాధించాలని డిమాండు చేసింది. ఈ తీర్మానాన్ని రాంభూపాల్ ప్రవేశపెట్టగా, కె.రమాదేవి బలపర్చారు. అనంతరం, మహాసభలో ముందుగానే పంపిణీ చేసిన పలు తీర్మానాలను ప్రభాకర రెడ్డి ప్రవేశపెట్టగా, ఎవి నాగేశ్వరరావు బలపర్చారు. అందరికీ ఇళ్లు, పట్టాలూ ఇవ్వాలని; కౌలు రైతులకు గుర్తింపు, రక్షణ కోసం సమగ్ర చట్టం చేయాలని; వృత్తిదారుల సమస్యలను పరిష్కరించా లని; ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయాలని; సమగ్ర సాంస్క ృతిక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని; ఉపాధి హామీ పథకాన్ని పటిష్టం చేయాలని, పట్టణ ప్రాంతాల్లోనూ అమలు చేయాలని; రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం గ్రాంట్లు విడుదల చేయాలని, రాజధాని ప్రాంత ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలని; దేవస్థానం, వక్ఫ్, ఇతర ఛారిటీ సంస్థల భూములను పేద, చిన్న, సన్నకారు రైతులకు కౌలుకివ్వాలని; ఉద్యమాల సందర్భంగా పెట్టిన కేసులను ఎత్తి వేయాలని; పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని మహాసభ తీర్మానించింది.
