పోలవరం పూర్తి బాధ్యత కేంద్రానిదే

ప్రజాశక్తి – కామ్రేడ్‌ సీతారాం ఏచూరి నగర్‌ (నెల్లూరు) : పోలవరం పూర్తి బాధ్యత కేంద్రానిదేనని, నిధులన్నీ కేంద్రమే కేటాయించాలనీ, నిర్వాసితులకు సమగ్ర పునరావాసం, పూర్తిస్థాయి పరిహారం అందించాలని సిపిఎం 27వ రాష్ట్ర మహాసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. నెల్లూరులో మాగుంట లే అవుట్స్‌లో సీతారాం ఏచూరి నగర్‌(అనిల్‌ గార్డెన్స్‌)లో జరుగుతున్న మహాసభలో పోలవరంపై తీర్మానాన్ని పులి సంతోష్‌ ప్రవేశపెట్టారు. దీన్ని వి.కృష్ణయ్య బలపరిచారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల 356 గ్రామాల్లో 1,05,601 కుటుంబాలు పూర్తిగా నిర్వాసితమవుతాయని పేర్కొంది. దీనికి కేంద్ర ప్రభుత్వానిది ప్రధాన బాధ్యతని, కానీ బాధ్యతారాహిత్యంగా నిర్వాసితుల సమస్య తమకు సంబంధం లేదన్నట్లు ప్రకటించిందని తీర్మానంలో పేర్కొంది. ఎన్నికల ముందు హామీలు గుప్పించి అధికారంలోకొచ్చిన తరువాత ప్రభుత్వాలు నిర్వాసితులపై మాట మాట్లాడటం లేదని, ఎన్నికల హామీలు నిలబెట్టుకునే నిజాయితీ ఆయా పార్టీలకు లేదని పేర్కొంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం నిర్వాసితులపై మాట్లాడటం లేదని విమర్శించింది. నిర్మాణ బాధ్యత తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతను విస్మరించి నిర్వాసితుల పునరావాసం, పరిహారం గురించి ప్రస్తావనే లేదని పేర్కొంది. 2026 నాటికి 41.15 కాంటూరు పరిధిలోని కుటుంబాలకు పునరావాసం, పరిహారం పూర్తిచేస్తామని తాజా ప్రభుత్వం ప్రకటన చేసిందని, 45.72 కాంటూరు పరిధిలోని కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం సహాయం ఆధారంగా రెండోదశగా చేయగలమని చెబుతోందని పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి వల్ల ఏటేటా ముంపు మండలాలు గోదావరి వరదల్లో వారాల తరబడి మునిగి ఉంటున్నాయని, వేలాది మంది నిర్వాసితులు కొండలు, అడవుల్లో తలదాచుకోవాల్సిన దయనీయ స్థితులు ఏర్పడుతున్నాయని తెలిపింది. దీనిలో కేంద్ర ప్రభుత్వ వైఖరి అన్యాయంగా ఉందని, నిర్వాసితులకు 33 వేల కోట్లు కేటాయించాల్సినప్పటికీ, పదిశాతం కూడా కేటాయించలేదని, లక్షకుపైగా కుటుంబాలకు పునరావాసం, పరిహారం అమలు చేయాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం 12 శాతం కుటుంబాలకు మాత్రమే అసమగ్రంగా అమలు జరిపాయని, 2013 భూసేకరణ చట్టం సమగ్రంగా అమలు జరపాలని తీర్మానం కోరింది. దశలవారీగా కాకుండా ఎనిమిది మండలాల్లో నిర్వాసిత కుటుంబాలన్నిటికీ ఈ సంవత్సరంలోనే సమగ్ర పునరావాసం, పూర్తిస్థాయి పరిహారం చెల్లించాలని, పునరావాసం ప్యాకేజీ పదిలక్షలు ఇవ్వాలని కోరింది. శాస్త్రీయ పద్ధతుల్లో కాంటూరు సర్వే చేసి ముంపు ప్రాంతాలను ఖచ్చితంగా గుర్తించాలని, సమగ్ర పునరావాసం కల్పించాలని, పునరావాస కాలనీల్లో తగిన వసతులు కల్పించాలని, నాణ్యతతో ఇళ్లు, రహదారులు నిర్మించాలని తీర్మానించింది. భూమికి భూమి తగిన గ్రామానికి సమీపంలో సారవంతమైన విలువైన భూమి ఇవ్వాలని, సాగుభూములకు నష్టపరిహారం ఎకరాకు రూ.20 లక్షలివ్వాలని మహాసభ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ తీర్మానించింది.

➡️