Oct 02,2022 22:06
  • బిజెపి హటావో హిమాచల్‌ బచావో నినాదంతో ప్రచారం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సిపిఎం సన్నద్ధం అవుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు11 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. ''బిజెపి హటావో హిమాచల్‌ బచావో'' నినాదంతో సిపిఎం ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టింది. సిమ్లాలోని సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ కార్యదర్శివర్గ సమావేశం జరిగింది. ఇందులో వచ్చే ఎన్నికలకు11 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేశారు. సిమ్లా, ఉనా, సోలన్‌, కులు స్థానాల్లో సిపిఎం అభ్యర్థులను త్వరలో ప్రకటించనుంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఓంకార్‌ షాద్‌ మీడియాకు అభ్యర్థుల జాబితాను వెల్లడించారు. సిమ్లా జిల్లా థియోగ్‌ నియోజకవర్గం నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే, సిపిఎం సీనియర్‌ నేత రాకేష్‌ సింఘా మరోసారి పోటీ చేయనున్నారు. కుశాల్‌ భరద్వాజ్‌ (జోగిందర్‌ నగర్‌), దేవకీ నంద (అన్నీ), భూపేంద్ర సింగ్‌ (ధర్మపూర్‌, మండి), మహేంద్ర రాణా (సరాజ్‌), డాక్టర్‌ కాశ్మీర్‌ సింగ్‌ ఠాకూర్‌ (హమీర్‌పూర్‌), నరేంద్ర సింగ్‌ (చంబా), ఆశిష్‌ కుమార్‌ (పచ్చడ్‌), డాక్టర్‌ కుల్దీప్‌ సింగ్‌ తన్వర్‌ (కసుంప్తి), కిషోరి లాల్‌ (కర్సోగ్‌), విశాల్‌ శంక్త (జుబ్బల్‌ కోటఘై) బరిలోకి దిగనున్నారు. మిగిలిన స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేందుకు రాష్ట్ర కమిటీ మరోసారి సమావేశం కానుంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఎం 13 మంది అభ్యర్థులను నిలబెట్టింది. సిపిఎం సీనియర్‌ నేత రాకేష్‌ సింఘా బిజెపి అభ్యర్థి రాకేష్‌ వర్మను ఓడించి, థియోగ్‌ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.