Sep 19,2023 16:03

ప్రజాశక్తి-టెక్కలి రూరల్ : విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకై సెప్టెంబరు 20 నుండి 29 వరకు సిపిఎం ఉత్తరాంధ్ర ఉక్కు రక్షణ ద్వీచక్ర వాహనాలు యాత్ర జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు తెలిపారు. టెక్కలి పార్టీ కార్యాలయంలో  మాట్లాడుతూ విశాఖపట్నంలో ఉక్కు రక్షణ బైక్‌యాత్ర సెప్టెంబరు 20న విశాఖపట్నంలో ప్రారంభమై 21న ఎచ్చెర్ల చేరుకుంటుందని, 22 టెక్కలి చేరుకొని 23 పలాస మీదుగా ఇచ్చాపురం వెళ్ళి మందస, పాతపట్నం, కొత్తూరు గుండా ఆరు జిల్లాలలో సుమారు 1200 కిలోమీటర్లు సాగి 29వ తేదీన స్టీల్‌ ప్లాంట్‌ వద్ద చేపడుతున్న నిరాహారదీక్ష శిబిరం వద్దకు చేరుకుంటుంది. బైక్‌యాత్ర ముగింపు సందర్భంగా 29న సాయంత్రం ఐదు గంటలకు భారీ బహిరంగసభతో ఈ యాత్ర ముగుస్తుంది. ప్రారంభానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు హాజరవుతారని, ముగింపు సభకు అఖిలభారత నాయుకులు హజరవుతారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ప్రతిఘటన తప్పదనే హెచ్చరిక ఈ యాత్ర ద్వారా ఈ ప్రాంత ప్రజలు చేయాలని కోరారు.
         పాలకుల మెడలు వంచి పోరాడి సాధించుకున్న ఈ ప్లాంట్‌ను తిరిగి అటువంటి పోరాటాల ద్వారానే మొండిగా ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వ మెడలు వంచి రక్షించుకోవడం సాధ్యమని,  ఇదే ప్లాంట్‌ పరిరక్షణకు ఏకైక  మార్గమని సిపిఎం పార్టీ మనవిచేస్తూ, ఈ మహోన్నత ఉద్యమంలో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేసారు. ఆంధ్ర రాష్ట్రానికి ఏకైక భారీ పరిశ్రమ, ఉత్తరాంధ్రలో లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ప్రభుత్వరంగ సంస్థ విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌. దీనిని అమ్మేయాలని కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తరాంధ్ర ప్రజలు సహించేది లేదని తెలిపారు. తెలుగు ప్రజలు పోరాడి 32 మంది ప్రాణత్యాగాలతో, 16 వేల మంది రైతుల త్యాగ ఫలంగా  సాధించుకున్న ఈ ప్లాంట్‌ ను రక్షించుకుని తీరతామని విశాఖపట్నంలో ఉక్కు పరిశ్రమ వద్ద, ఆర్.టి.సి బస్టాండు సమీపాన గాంధీవిగ్రహం వద్ద నిరాహారదీక్షలు చేపడుతున్నారు. అయినా కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు లేదు సరి కదా దీనిని అమ్మడం సాధ్యం కాకపోతే మూసివేస్తామని పార్లమెంట్‌ సాక్షిగా కేంద్ర మంత్రి బెదిరింపులకు పూనుకున్నారని విమర్శించారు. ఆలస్యం అవుతున్న కొద్ది ప్రజలు, కార్మికులు నీరస పడిపోయి, ఉద్యమాన్ని వదిలేస్తారని నరేంద్ర మోడీ ప్రభుత్వం భావించింది. అయితే వారి అంచనాలకు భిన్నంగా రెట్టించిన ఉత్సాహంతో,  పట్టుదలతో కార్మికులు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు.
                రాష్ట్రంలోనే అతిపెద్ద పరిశ్రమగా ఉండి రాష్ట్ర అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న ఇటువంటి సంస్థను కాపాడుకోవడం ద్వారానే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోగలం. కానీ దీనికి భిన్నంగా, రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలైన అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి, జనసేన పార్టీలు వ్యవహరిస్తున్నాయి. అధికార వైసిపి మొక్కుబడిగా అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులిపేసుకుంది. కానీ రాష్ట్ర ప్రజలను సమీకరించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి కనీస ప్రయత్నం కూడా చేయలేదు. ప్రతిపక్ష టీడీపీ రాష్ట్ర వైసీపీని విమర్శించడం తప్ప ప్లాంటును అమ్మేస్తామని తెగేసి చెప్పిన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని పల్లెత్తు  మాట కూడా అనడం లేదు. ఇక ప్రశ్నిస్తానని బయలుదేరిన జనసేన అధినేత ఆ పని వదిలేసి రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న  కేంద్ర మోడీ ప్రభుత్వ పంచన చేరాడు. తమలో తాము కలహించుకోవడం తప్ప రాష్ట్రానికి,  ఉత్తరాంధ్రకు ఎంతో  ద్రోహం చేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మాత్రం పల్లెత్తు మాట అనడానికి కూడా ఈ మూడు పార్టీలు సాహసించడం లేదు. 
 ఇదే అవకాశంగా భావించి కేంద్ర మోడీ ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటును అష్టదిగ్బంధనం చేస్తోంది. ఉత్పత్తిని ఏకపక్షంగా తగ్గించి వేసింది. మూడవ బ్లాస్ట్‌ ఫర్నేస్‌ను నిలిపివేసింది.  ఉన్నత స్థాయి అధికారులతో సహా అనేక  ఖాళీలను నింపడం లేదు. రోజువారీ పనులకు అవసరమైన వర్కింగ్‌ క్యాపిటల్‌ కూడా లేకుండా చేస్తోంది.  దేశంలోని ప్రైవేట్‌ రంగంతో సహా అన్ని స్టీల్‌ ప్లాంట్లకు సొంత ముడి సరుకులను, గనులను కేటాయించిన కేంద్ర ప్రభుత్వం మన విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ కు మాత్రం సొంతగనులు కేటాయించడానికి ససేమురా  నిరాకరిస్తోంది.  దీనికి తోడు అధిక ధర చెల్లించి ఇనుప ఖనిజాన్ని కొంటున్న ఛత్తీస్‌ ఘడ్‌ లోని ఎన్‌ఎండిసి నుండి ఇక కొనుగోలుకు అనుమతించకుండా, దూర ప్రాంతంలోని కర్ణాటక నుండి కొనుగోలు చేసుకోమని తెలిపింది.  దీనర్ధం రవాణా ఖర్చులు పెరిగి స్టీల్‌ ప్లాంట్‌ మరింత కష్టాల్లోకి నెట్టబడుతుంది. మరోపక్క విదేశాల నుండి దిగుమతి చేసుకున్న ముడి సరుకులు అన్‌ లోడ్‌ చేయకుండా పక్కనే ఉన్న అదానీకి చెందిన గంగవరం పోర్టు విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ ను ఇబ్బందులు పెడుతూ,  పెనాల్టీలు విధిస్తోంది.  ప్లాంట్‌ లోని కీలకమైన ఆక్సిజన్‌ ప్లాంట్‌ ను ప్రైవేటు పరం చేస్తున్నారు. 1400 ఎకరాల స్టీల్‌ భూమిని ఇప్పటికే గంగవరం పోర్టు కు ఇచ్చేశారు. ఇప్పుడు మరలా మరింత భూమిని అమ్మేయడానికి పావులు కదుపుతున్నారు. మొత్తం ప్లాంట్‌ విలువను తగ్గించి చూపి, కారు చవుకగా తమ కార్పొరేట్‌ మిత్రులకు ధారాదత్తం చేయజూస్తున్నారు. 
    ఈ రకంగా అన్ని విధాలుగా స్టీల్‌ ప్లాంట్‌ ను బలహీనపరిచే చర్యలకు కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం పూరకంగానే పాల్పడుతోందని స్పష్టంగా తెలుస్తోంది.  అదే సందర్భంలో ఈ కేంద్ర ప్రభుత్వ దుర్మార్గాన్ని రాష్ట్రం లోని ప్రధాన మూడు రాజకీయ పార్టీలు ఎదుర్కోలేవని, అంతే కాకుండా ఈ మూడు పార్టీలూ కేంద్ర బిజెపికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహకరిస్తున్నాయని కూడా తేటతెల్లమైపోయింది. అందువల్ల పోరాడి సాధించుకున్న విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ ను కాపాడుకోవడం కేవలం ఈ రాష్ట్ర ప్రజల చైతన్యం మీదనే నేడు ఆధారపడి ఉంది.
       రాష్ట్రాభవృద్ధితో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధిలో విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ కీలక పాత్ర పోషిస్తోంది. సరైన ఉపాధి అవకాశాలు లేక వెనుకబడిన ఉత్తరాంధ్రలోని అనేకమంది యువకులకు విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ ఉపాధి కల్పిస్తోంది. మన ప్రాంతంలో అత్యధికంగా ఉన్న గిరిజనులకు రిజర్వేషన్ల ద్వారా ఇక్కడ ఉపాధి లభిస్తోం ది. నేటికీ ప్లాంట్‌ లో ఉపాధి కోసం ఎదురు చూస్తున్న ఆరు వేల మంది నిర్వాసితుల ఆశలు అడియాశలు అవుతాయి. ప్లాంట్‌ పూర్తి స్థాయిలో నడిస్తే కలిగే మరో పాతిక వేల మంది మన యువత ఉపాధి అవకాశాలు గల్లంతవుతాయి. దీన్ని ప్రైవేట్‌ పరం చేయడం అంటే దళితులు,  గిరిజనులు ఉపాధి కోల్పోయి సామాజిక న్యాయం హరించుకుపోతుంది.  దీనివల్ల ఉత్తరాంధ్ర మరింత వెనుకబాటులోకే నెట్టబడుతుంది. ఇప్పటికే రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఉత్తరాంధ్రకు రావలసిన ప్రత్యేక అభివృద్ధి పేకేజీ, మెట్రో  రైల్‌, రైల్వే జోన్‌, విద్యా సంస్థల నిర్మాణం నేటికీ ఆచరణ రూపం దాల్చ లేదు. ఈ దిశలో ఉత్తరాంధ్ర ప్రజలను చైతన్య పరచడానికి ఈ యాత్ర చేపట్టామని తెలిపారు. ఈయనతో పాటు సిపిఎం నాయకులు నంభూరు షన్మఖరావు, కొల్లి యల్లయ్య, హనుమంతు ఈశ్వరరావు, పాలిన సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.