Aug 09,2022 21:44

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యుత్‌ వినియోగదారుల నుంచి 36 నెలలపాటు ట్రూఅప్‌ ఛార్జీలు వసూలు చేయాలను విద్యుత్‌ పంపిణీ సంస్థల నిర్ణయాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అధిక ధరలతో సతమతమవుతున్న ప్రజలపై ట్రూఅప్‌ ఛార్జీల భారం వేయాలను నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 2014-15 నుంచి 2018-19 వరకు డిస్కమ్‌లకు వచ్చిన నష్టాలను పూడ్చుకోవడానికి వినియోగదారుల నుంచి 36 నెలలపాటు ట్రూఅప్‌ వసూలు చేయాలని వివిధ పంపిణీ సంస్థలు తాజాగా నిర్ణయం తీసుకున్నాయని వివరించారు. గతంలో యూనిట్‌కు రూ.1.27 చొప్పున ట్రూఅప్‌ ఛార్జీలు వసూలు చేసిన దానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయని పేర్కొన్నారు. కొన్ని నెలలపాటు వసూలు చేసిన మొత్తాన్ని తరువాత బిల్లుల్లో సర్దుబాటు చేశారని వెల్లడించారు. ఈసారి అలా కాకుండా అత్యధిక జిల్లాల్లో యూనిట్‌కు 0.22 పైసల చొప్పున ఈ ఆగస్టు నెల నుంచి రాబోయే మూడేళ్లపాటు వసూలు చేయబోతున్నారని తెలిపారు. ఏప్రిల్‌ నుంచి శ్లాబులు మార్చి టారిఫ్‌ పెంచి భారం మోపారని, అదనపు డిపాజిట్లు పేరుతో అడ్డగోలుగా వసూళ్లు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌సి, ఎస్‌టిలకు ఇచ్చే విద్యుత్‌ రాయితీలకు కోతలు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వీటికి తోడు 2014-15 నుంచి 2018-19లో వాడిన యూనిట్ల ఆధారంగా ట్రూఅప్‌ ఛార్జీలు వసూలు చేయడం పూర్తిగా అసంబద్ధమైన నిర్ణయమని విమర్శించారు. ఇంటి యజమానులపై భారం వేయడమే కాకుండా శాశ్వతంగా ఒకచోట ఉండని అద్దె వినియోగదారులపై భారం వేయడం గర్హనీయమని అన్నారు. ప్రస్తుత వినియోగం తక్కువ ఉన్నా గత వినియోగాన్ని బట్టి వసూలు చేయడమంటే ప్రజలను దోపిడీ చేయడమే అవుతుందని విమర్శించారు. విద్యుత్‌ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై భారాలను మోపే ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని, ట్రూఅప్‌ ఛార్జీలను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.