Mar 20,2023 22:53

ప్రజాశక్తి-విజయవాడ : కనీస వేతనాలు, ఇతర సమస్యలను పరిష్కరించాలని అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్న కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటి తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేయడానికి ఈ రోజు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి విజయవాడకు చేరుకున్న అంగన్‌వాడీలను రైల్వేస్టేషన్‌లు, ఇతర చోట్ల ఎక్కడికక్కడ అటకాయించి 1500 మందిని అరెస్టులు చేయడం, విజయవాడకు రాకుండా జిల్లాల్లో బస్‌ స్టేషన్లు, రైల్వే స్టేషన్ల వద్ద అటకాయించి అరెస్టులు చేయడం అన్యాయమని పేర్కొంది.  మహిళలన్న విచక్షణ లేకుండా పోలీసులు రోడ్లపై పడవేసి ఈడ్చుకెళ్ళారని తెలిపింది.  అంగన్‌వాడీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సింది పోయి వారిపై దౌర్జన్యంగా వ్యవహరించడం గర్హనీయమన్నారు. అరెస్టు అయిన వారిలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.హెచ్‌.నర్సింగరావు, నాయకులు సి.హెచ్‌.బాబూరావు, రాష్ట్ర కార్యదర్శులు కె.ఉమామహేశ్వరరావు, కె.ధనలక్ష్మి ఉన్నారని వెల్లడించింది. అక్రమ అరెస్టులకు నిరసనగా కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌లో అంగన్‌వాడీలు చేస్తున్న దీక్షలకు సిపిఎం రాష్ట్ర కమిటి మద్దతు తెలియజేసింది. మద్దతుగా సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు వి.శ్రీనివాసరావు, కె.రామకృష్ణ, ఇతర వామపక్ష పార్టీల నాయకులు దీక్షకు కూర్చున్నారు. అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ యూనియన్‌తో చర్చించి పరిష్కరించాలని, అరెస్టు చేసినవారిని బేషరతుగా విడుదల చేయాలని, సిపిఎం డిమాండ్‌ చేసింది.

  • పౌరహక్కుల ఐక్య వేదిక, వామపక్ష పార్టీల నాయకుల అరెస్టులకు ఖండన

కూడళ్ళలో ర్యాలీలు, సభలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జివో నం.1ని రద్దు చేయాలని పౌరసంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ రోజు చేయతలపెట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని అడ్డుకుని నాయకులను అరెస్టులు చేయడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటి ఖండించింది. ఏ జివోకు వ్యతిరేకంగా పోరాడుతున్నారో అదే జివో నం.1ను ఉపయోగించి నిర్బంధానికి పూనుకోవడం ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు నిదర్శనమన్నారు. మేధావులు, లాయర్లు, డాక్టర్లు, ప్రతిపక్ష పార్టీలు, ప్రజాతంత్ర వాదులు ఈ జివోను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుండి ఏమాత్రం స్పందన లేదన్నారు. దీనికి నిరసనగా జివో నం.1ని రద్దు చేయాలని పౌరసంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ప్రశాంతంగా నిర్వహిస్తున్న ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని  పోలీసులు అడ్డుకుని అక్రమంగా అరెస్టులు చేయడం అప్రజాస్వామికమని పేర్కొంది. సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు వి.శ్రీనివాసరావు, కె.రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, వి.వెంకటేశ్వర్లు, సిపిఐ కార్యదర్శివర్గ సభ్యులు ఎ.వనజ, ముప్పాళ్ళ నాగేశ్వరరావు, ఈశ్వరయ్య, దోనేపూడి శంకర్‌, సిపిఐ(యం.యల్‌) నగర అధ్యక్షులు రామకృష్ణ, ఇతర వామపక్ష, విద్యార్ధి, యువజన సంఘ నాయకులను అరెస్టు చేయడాన్ని సిపిఎం ఖండించింది. ఐక్యవేదిక నాయకులను గృహ నిర్బంధం చేయడం గర్హనీయమని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి ఇప్పటికైనా జివో నం.1ని రద్దు చేయాలని, అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్‌ చేసింది. జివో నం.1కు వ్యతిరేకంగా, అంగన్‌వాడీ సమస్యలపై ఆందోళనలో అరెస్టయిన నాయకులు, కార్యకర్తల పరామర్శకు వెళ్ళిన సిపిఎం సీనియర్‌ నాయకులు పి.మధును అరెస్టు చేయడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటి ఖండించింది.