
- సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శులు పిలుపు
ప్రజాశక్తి-చిత్తూరు : రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను భారీ స్థాయిలో పెంచి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నదని వీటిని వ్యతిరేకిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పిలుపుమేరకు 25న కలెక్టరేట్ వద్ద సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో జరిగే ధర్నాను జయప్రదం చేయాలని మంగళవారం సిపిఎం కార్యాలయంలో జరిగిన సమావేశం పిలుపునిచ్చింది. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ నాగరాజు లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా పెంచిన విద్యుత్ ఛార్జీలను భరించ లేకుంటే మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు మళ్లీ 250 కోట్లు పెంచడం దారుణం అన్నారు. వీటిని నిరసిస్తూ వామపక్షాలు చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలను రాష్ట్రాల్లో అమలు చేయాలని ఒత్తిడి తీసుకురావడంతో దేశంలో ఎక్కడా అమలు చేయని రాష్ట్రాలు బిజెపిని వ్యతిరేకంగా నిలబడుతున్నాయి. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం బిజెపి చెప్పిన వాటిని తూచా తప్పకుండా అమలు చేస్తూ విద్యుత్తు చార్జీలను భారీ స్థాయిలో పెంచింది. ఇప్పటికే ఆరు రకాల పన్నులు పేరుతో విద్యుత్ చార్జీలు పెంచింది. ఇప్పుడు మళ్లీ పెంచడానికి సిద్ధమైంది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచితే ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేం అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు భారం ఉండదని హామీ ఇచ్చారు.ఆ హామీని తుంగలో తొక్కి మరి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎనిమిది సార్లు గత ప్రభుత్వం కంటే ఎక్కువ స్థాయిలో కరెంటు చార్జీలు పెంచారు. గతంలో వామపక్షాలు చేపట్టిన విద్యుత్ ఉద్యమం మరోసారి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టాల్సి వస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ప్రశ్నిస్తూ వారిని ప్రశ్నిస్తున్న వారిపై దౌర్జన్యాలు చేస్తున్నది. మరోపక్క ప్రజలపై భారం మోపుతున్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజల్లో విస్తృతమైన ప్రచార కార్యక్రమాలు వామపక్షాలు చేస్తున్నాయి. ఈ కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. విద్యుత్తు చార్జీలను తగ్గించేంతవరకు ఈ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా నాయకులు కే సురేంద్రన్, పి. చైతన్య, బాలసుబ్రమణ్యం, సిపిఐ నాయకులు గోపీనాథ్, విజయ గౌరీ, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.