Oct 05,2022 13:48
  • ఈనెల 8న కడప పాత బస్టాండ్లో  సీపీఎం ఆందోళన
  •  సిపిఎం నగర కార్యదర్శి రామమోహన్ 

ప్రజాశక్తి-కడప అర్బన్ : కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ మూడు సిలిండర్లు దాటితే అదనంగా ప్రతి సిలిండర్ కు రూ.500 వసూలు చేయాలనే ప్రతిపాదన దుర్మార్గమని, తక్షణమే ఆ ప్రతిపాదన చేసే ఆలోచనను విరమించుకోవాలని సిపిఎం నగర కార్యదర్శి ఎ.రామమోహన్, నగర కార్యదర్శి వర్గ సభ్యులు పి.చంద్రారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం నగరంలో సీపీఎం కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏడాదికి మూడు సిలిండర్లు మాత్రమే ఇస్తామని ప్రతిపాదించటం దుర్మార్గమన్నారు. ఇప్పటికే గ్యాస్ ధరను ఇబ్బందిగా పెంచిన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మళ్ళీ సిలిండర్ల సంఖ్యను తగ్గించటం సమంజసం కాదన్నారు. సామాన్య, మధ్యతరగతి ప్రజానీకం మీద ఈ నిర్ణయం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. ఇప్పటికే అసంఘటితరంగ కార్మికులు, సామాన్య,  మధ్యతరగతి ప్రజలు రోజురోజుకు పెరుగుతున్న భారాలను భరించలేని స్థితిలోకి నెట్టబడ్డారని అన్నారు. సామాన్య ప్రజల ఆదాయం, కార్మికుల, ఉద్యోగుల వేతనాలు పెరగకపోవడం, ధరల పెరుగుదల వల్ల ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని వారన్నారు.  ఈ విధానాన్ని ప్రజానీకం తీవ్రంగా వ్యతిరేకించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏడాదికి మూడు సిలిండర్లు మాత్రమే ఇవ్వాలని, ఆ తర్వాత అదనపు సిలిండర్ లకు రూ.500  అదనంగా వసూలు చేయాలనే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఈనెల 8వ తేదీన నగరం పాత బస్టాండ్ లో ఉన్న పూలే సర్కిల్లో నిరసన కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు.కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి నగర ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.