May 17,2023 15:32
  • సిఎంకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి లేఖ

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : వేట నిషేధకాలంలో మత్స్యకారులకు ఇచ్చే మత్స్యకార భరోసా భృతి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో వేటపై ఆధారపడి జీవనం సాగించే మత్స్యకారులు, అనుబంధ మత్స్యకార్మికులకు వర్తింపజేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ కోరింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు బుధవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ రాశారు. మత్స్యకారులకు వర్తించే పథకాలు మొత్తం 2015లో గుర్తించిన లెక్కల ప్రకారమే అందజేస్తున్నారని, అప్పటి ప్రభుత్వం గుర్తించిన రికార్డుల ప్రకారమే రాష్ట్రంలో మోటరైజ్డ్‌ బోట్లు 20 వేలు, మెకనైజ్‌డ్‌ బోట్లు ఆరువేలు ఉన్నాయని తెలిపారు. వాస్తవానికి వీటి సంఖ్య ఇంకా అదనంగా ఉంటుందని, అంతేకాక మెట్ట ప్రాంతాల్లోనూ, నదీపరివాహక ప్రాంతాల్లోనూ సంప్రదాయ వేటపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులు 1,60,000 మంది ఉంటారని తెలిపారు. వీరితోపాటు ప్యాకింగ్‌, ట్రాన్స్‌పోర్టు, మార్కెటింగ్‌పై ఆధారపడి జీవించేవారికీ వేట నిషేధకాలంలో ఉపాధి ఉండదని పేర్కొన్నారు. వీరందరికీ ప్రభుత్వం నుండి వేట నిషేధ భృతి అందించాల్సిన అవసరం ఉందని వివరించారు. మత్స్యకార భరోసా పథకం కింద 20 వేల మోటరైజ్డ్‌ బోట్లుపై పని చేసే మత్స్యకారులకు (బోటుకు ఆరుగురు చొప్పున) మాత్రమే భృతి అందిస్తున్నారని, దీనివల్ల అర్హులైన మత్స్యకారులందరూ పరిహారానికి దూరమవుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలించి ప్రస్తుత అంచనాల ప్రకారం లబ్ధిదారులను గుర్తించి సముద్రతీర, మెట్ట ప్రాంతాల్లో మత్స్యకారులందరికీ భృతి అందించాలని కోరారు. బోట్లకు ప్రభుత్వం ఇచ్చే డీజిల్‌ చిన్న బోట్లకు 2 వేల లీటర్లు, పెద్ద బోట్లకు 3 వేల లీటర్లు ఇవ్వాలని, చేపల చెరువులకిచ్చే విద్యుత్‌ సబ్సిడీ పునరుద్ధరించాలని కోరారు.