Jun 26,2022 20:42
  • కోర్టు వ్యాఖ్యలు దురదృష్టకరం
  • గుజరాత్‌ పోలీసుల చర్య దారుణం

ముంబయి: 2002 గుజరాత్‌ నరమేథంలో బాధితుల తరపున సుదీర్ఘ పోరాటం సాగిస్తున్న సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌ను అరెస్టు చేసిన గుజరాత్‌ ఎటిఎస్‌ పోలీసుల చర్యపై తీవ్ర విమర్శలస్తున్నాయి. అన్ని వైపుల నుంచి ఆమెకు సంఘీభావం వెల్లువెత్తింది. గుజరాత్‌లో ఊచకోతలో అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తోస హా 64 మందికి సిట్‌ క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసిన మరుసటి రోజే ఈ అరెస్టు చోటుచేసుకుంది. దీనిని సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో, అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా), సఫ్దర్‌ హష్మి స్మారక ట్రస్టు (సహమత్‌) తీవ్రంగా ఖండించాయి. ఆమెపై బనాయించిన తప్పుడు కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని అవి డిమాండ్‌ చేశాయి.
సెతల్వాద్‌ అరెస్టును సిపిఐ(ఎం) తీవ్రంగా ఖండించింది. గుజరాత్‌ పోలీసుల చర్య ప్రజాతంత్ర భావాలు కలిగిన పౌరులకు. రాజ్యం లేదా ప్రభుత్వ పాత్రను ప్రశ్నించే వారికి ముప్పు తప్పదని బెదిరించేదిలా ఉందని సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో ఆదివారం నాడిక్కడ విడుదలజేసిన ప్రకటనలో పేర్కొంది. సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన సందేహాస్పద తీర్పు ఆమె అరెస్టుకు గుజరాత్‌ ప్రభుత్వాన్ని ప్రేరేపించేదిగా ఉందని మార్క్సిస్టు పార్టీ వ్యాఖ్యానించింది. ఆ తీర్పు ప్రకారం.. కోర్టు ఏర్పాటు చేసే సిట్‌ న్యాయపరమైన అప్పీళ్ల పరిధి వెలుపలిదిగా పరిగణించబడుతుంది. దీనిపై ఎవరైనా అప్పీలు చేసుకోవచ్చు. ఈ కేసులోజకియా జఫ్రీ, తీస్తా సెతల్వాద్‌ అదే పని చేశారు. అందుకు వారిపై ఈ ప్రక్రియను దుర్వినియోగ పరిచారని ఆరోపణలు మోపారు. న్యాయం కోసం 16 సంవత్సరాలు సాగిన ఈ పోరాటాన్ని సంచలనం కోసం కొందరు చేసిన యత్నం అంటూ అనుచితమైన వ్యాఖ్యలు చేయడం విస్తుగొలుపుతుందని పొలిట్‌బ్యూరో పేర్కొంది. 2004 ఏప్రిల్‌లో ఇదే సుప్రీం కోర్టు అప్పటి ప్రభుత్వ నేతలను ఆధునిక కాలపు నీరోలుగా అభివర్ణించిన విషయాన్ని పొలిట్‌బ్యూరో ప్రకటన గుర్తు చేసింది.
అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఒక ప్రకట చేస్తూ, గుజరాత్‌ హత్యాకాండలో తన భర్త, ఎంపీ ఇషాన్‌ జఫ్రీని దారుణంగా చంపినవారిని శిక్షించాలంటూ జకియా జఫ్రీ దాఖలు చేసిన అప్పీలును సుప్రీం కోర్టు కొట్టివేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. జఫ్రీకి గట్టి దన్నుగా నిలిచిన తీస్తా సెతల్వాద్‌ను అరెస్టు చేయడానికి గుజరాత్‌ పోలీసులు ఎక్కడ లేని ఆత్రుతన ప్రదర్శించడం విస్తుగొలుపుతోందని ఐద్వా ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది.
సఫ్దర్‌ హష్మి స్మారక ట్రస్టు (సహమత్‌) ఒక ప్రకటన చేస్తూ, మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా, న్యాయం, మానవ హక్కుల కోసం దశాబ్దాలుగా పోరాడుతున్న వ్యక్తి సెతల్వాద్‌, అటువంటి అమెను అరెస్టు చేయడం దారుణమని వ్యాఖ్యానించింది. గుజరాత్‌ పోలీసుల చర్య ఆమె నోరు నొక్కడమే కాదు, హక్కుల కోసం పోరాడే ఇతరులను భయపెట్టేందుకు ఒక సంకేతాన్ని ఇస్తుందని ట్రస్టు విడుదలజేసిన ఆ ప్రకటన పేర్కొంది.
సెతల్వాద్‌ను శనివారం ముంబయిలోని ఆమె నివాసం నుంచి శాంతాక్రజ్‌ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి, అక్కడి నుంచి అహ్మదాబాద్‌కు తరలించడానికి ముందు అంటే సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. సెతల్వాద్‌ శాంతాక్రజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో చేతి రాతతో సమర్పించిన ఫిర్యాదులో '' నా ప్రాణాలకు ముప్పుఉంది. అహ్మదాబాద్‌ ఎటిఎస్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ జె హెచ్‌ పటేల్‌ , సివిల్‌ దుస్తుల్లో వున్న మరో మహిళా అధికారి తన పడకగదిలోకి చొచ్చుకొచ్చారని, తన లాయర్‌తో మాట్లాడాలని కోరినప్పుడు, తనపై దాడి చేశారని, తన ఎడమచేతికి గాయమైందని, తన లాయర్‌ వచ్చేవరకు ఎఫ్‌ఐఆర్‌ కానీ, వారెంట్‌ కానీ తనకు చూపలేదని సెతల్వాద్‌ ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.