
- పిడిఎఫ్ అభ్యర్థులు ఓడిపోవడం బాధాకరం
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : శాసన మండలి ఎన్నికల్లో మూడు పట్టభద్రుల నియోజకవర్గాల్లో విద్యావంతులు వైసిపి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పును సిపిఎం స్వాగతించింది. రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపికి రాష్ట్ర ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారని తెలిపింది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం విజయవాడలో వై వెంకటేశ్వరరావు అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ సమావేశంలో ఆమోదించిన తీర్మానాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మీడియాకు విడుదల చేశారు.
అనర్హులను ఓటర్లుగా నమోదు చేయించడం మొదలు డబ్బు వెదజల్లడం, అధికార దుర్వినియోగం, దొంగ ఓట్లు వేయించడం వరకూ అధికార వైసిపి అనేక అక్రమాలకు పాల్పడినా వారికి పరాజయం తప్పలేదని తెలిపింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఇతర శ్రమజీవుల సమస్యలను పరిష్కరించలేదు సరికదా వారు సాగించిన ఉద్యమాలపై తీవ్ర నిర్బంధం విధించిందని పేర్కొంది. ప్రభుత్వ తీరుకు ప్రతిఘటనే పట్టభద్రుల తాజా తీర్పని, ప్రభుత్వ విధానాలకు నిరసనగానూ, వాటికి వ్యతిరేకంగా సాగిస్తున్న ఉద్యమాల కొనసాగింపుగానే పట్టభద్రుల ఓటును వినియోగించారని వివరించింది. ఉపాధ్యాయులు, పట్టభద్రుల సమస్యలపై నిరంతరాయంగా, నిస్వార్థంగా పనిచేస్తున్న పిడిఎఫ్ అభ్యర్థులు ఓడిపోవడం బాధాకరమని తెలిపింది. ప్రజా ఉద్యమాలను మరింత సంఘటితం చేసుకోవాల్సిన ఆవశ్యకతను ఇది వెల్లడిస్తున్నదని, ఉపాధ్యాయ స్థానాల్లో వైసిపిని ఓడించేందుకు తెలుగుదేశం పార్టీ ఆసక్తి చూపకపోవడం రాజకీయ వైఫల్యంగా భావిస్తున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గం పేర్కొంది. రానున్న రోజుల్లో మరిన్ని ఐక్య ఉద్యమాలను నిర్వహించి ప్రజా సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వం మెడలు వంచాలని, అన్ని వర్గాలు, తరగతుల ప్రజానీకం పోరాటాలకు సన్నద్ధం కావాలని విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వం ఇప్పటికైనా తమ విధానాలపై పునరాలోచించి, ప్రజానుకూల చర్యలు చేపట్టాలని, నిర్బంధ వైఖరిని విడనాడాలని కోరింది.