Sep 25,2021 10:41

వేలూర్‌ : కుటుంబ కలహాల కారణంగా తన ముగ్గురు పిల్లల గొంతునులిమి చంపి తల్లి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన వేటూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.... వేలూర్‌ తోటపాళ్యంకు చెందిన దినేష్‌ టైల్స్‌ అంటించే పని చేస్తుంటాడు. వేలూర్‌ సలవన్‌పేటకు చెందిన జీవిత (23)తో దినేష్‌కు ఆరు సంవత్సరాల క్రితం పెళ్లి అయ్యింది. వీరికి అక్షయ (5), నందకుమార్‌ (4), 6 నెలల పాప ఉన్నారు. కుటుంబం సలవన్‌పేట కచ్చేరి వీధిలోని అద్దె ఇంట్లో నివాసం ఉంటుంది. దినేష్‌ రోజూ మద్యం మత్తులో భార్యతో గొడవపడటమే కాకుండా ఆమెను చిత్రహింసలు పెట్టేవాడు. ఇటీవల ఆమె తిరుప్పూరు కుమరన్‌ 2 వ వీధిలో ఉన్న తన పుట్టింటికి పిల్లలతో వెళ్లింది. గత గురువారం ఉదయం తిరిగి తమ ఇంటికి వెళుతున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పి, జీవిత పిల్లలను తీసుకొని బయలుదేరింది. దినేష్‌ ఉదయం 7 గంటలకే పనికి వెళ్లిపోయాడు. జీవిత తల్లి ఆరోజు సాయంత్రం 5 గంటలకు కుమార్తెకు ఫోన్‌ చేసింది. ఎలాంటి సమాధానం రాకపోడంతో అనుమానంతో తన కుమారుడు జగదీశ్వరన్‌కు ఫోన్‌ చేసి వెళ్లి చూసి రావాలని కోరింది. అతను జీవిత ఇంటికి వెళ్లి చూడగా ఇంటి తలుపులు లోపల గడియపెట్టి ఉన్నాయి. కిటికీలో నుంచి ఇంటి లోపలి గడియను తీసి లోనికి వెళ్లి చూశాడు. ముగ్గురు పిల్లలు, తన సోదరి విగతజీవులుగా కనిపించారు. పిల్లల గొంతు నులిమి చంపి జీవిత ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు సోదరుడు గుర్తించాడు. సమాచారం అందుకున్న వేలూర్‌ దక్షిణ పోలీసు ఇన్‌స్పెక్టరు నందకుమార్‌, ఎడిఎస్‌పి ఆల్బర్ట్‌ జాన్‌ తమ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ రోజు రాత్రి సమయంలో ఇంటికి వచ్చిన దినేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.