Nov 24,2022 06:20

మహిళలు, బాలికలపై పెరుగుతున్న హింసను అడ్డుకునేందుకు జాతీయ స్థాయిలో ప్రణాళికలు రూపొందించాలంటూ ప్రపంచ దేశాలకు ఐక్యరాజ్యసమితి (ఐరాస) ఇచ్చిన పిలుపు తక్షణమే కార్యరూపం దాల్చాల్సి ఉంది. మహిళలపై హింస నిర్మూలన దినాన్ని అంతర్జాతీయ స్థాయిలో శుక్రవారం నిర్వహించనున్న నేపథ్యంలో ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ ఈ సూచన చేశారు. మహిళలపై జరుగుతున్న హింస ప్రపంచంలోనే అత్యంత పెద్దఎత్తున సాగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనగా ఆయన పేర్కొనడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రతి 11 నిమిషాలకు ఒక మహిళ లేదా బాలిక తన సన్నిహితుల చేతుల్లో హత్యకు గురవుతోందంటూ ఆయన వెల్లడించిన గణాంకాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. ఇది, సన్నిహితులు అంటే సమీప కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల చేతుల్లో ప్రాణాలు విడుస్తున్న వారి సంఖ్య మాత్రమే! ఇదికాకుండా, అపరిచితుల చేతుల్లో అర్ధాంతరంగా ముగుస్తున్న బతుకుల సంఖ్య వేరే! ఇక రకరకాల రూపాల్లో అత్యాచారాలకు, వేధింపులకు గురై బతుకుపోరును సాగిస్తున్న వారూ ఎందరో ఉన్నారు. ఇవికాక నూతన సాంకేతికత పుణ్యమాని ఆన్‌లైన్‌ అరాచకత్వమూ పెరిగిపోతోంది. జీవితాల్లోకి చొచ్చుకు వస్తున్న వివిధ సామాజిక మాధ్యమాల్లో లైంగిక దాడులకు, వేధింపులకూ గురవుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వీరందరి వాస్తవ సంఖ్య వెలుగులోకి వస్తే వేధింపులకు గురికాకుండా ఈ భూమి మీద మిగిలిన వారు ఒక్కరైనా ఉన్నారా అన్న ప్రశ్నతో గుండెలు బద్దలు కావడం ఖాయం.
ఈ హింసాగ్ని జ్వాలల్లో సమిధలుగా మారుతున్న భారతీయ మహిళల సంఖ్యా తక్కువేమీకాదు. కొద్దిరోజుల క్రితం ముక్కలు, ముక్కలుగా మారి మన మధ్య నుండి మాయమైన శ్రద్ధా వాకర్‌ నుండి నిర్భయలు, దీక్షలు ఎందరో...! మహిళలు, బాలికలుగా పుట్టిన పాపానికి ఎన్నటికీ తరగని క్షోభ వీరిది! దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ దారుణాన్ని అధికారాన్ని దక్కించుకోవడానికి నిచ్చెనగా వాడుకున్న ప్రస్తుత పాలకులే బిల్కిస్‌బానో కేసులో దోషులను జైలు నుండి విడుదల చేసి రాచమర్యాదలతో ఇంటికి పంపిన తీరును కళ్ళారా చూశాం. ఈ మనువాదుల ఏలుబడిలో బాధిత మహిళల సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. హిజాబ్‌ వేసుకున్నారంటూ బడి పిల్లలను కూడా వెంటాడి వేధిస్తున్న సంఘటనలను చూస్తున్నాం. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో వెల్లడించిన గణాంకాల ప్రకారమే గడిచిన ఆరేళ్లతో పోలిస్తే 2021వ సంవత్సరంలో అత్యధికంగా మహిళలు వేధింపులకు గురయ్యారు. ఈ వేధింపులకు సంబంధించి 2016వ సంవత్సరంలో 3,38,954 కేసులు నమోదు కాగా, 2021వ సంవత్సరంలో డిసెంబర్‌ 31 నాటికి 4,28, 278 కేసులు నమోదు అయ్యాయి. ఆరేళ్ల క్రితంతో పోలిస్తే ఇది 26.35 శాతం ఎక్కువ! ఘోరం ఏమిటంటే అత్యాచారాల రాజధానిగా మన దేశ కీర్తి అంతర్జాతీయ స్థాయిలో బజారుకెక్కడం! 2020లో 28,153 అత్యాచార కేసులు నమోదుకాగా, 2021లో ఈ సంఖ్య 31,878కి చేరింది. అంతకన్నా సిగ్గుపడాల్సిన విషయం ఏమిటంటే బాధిత మహిళలకు ఓదార్పు లభించకపోగా, అడుగడుగునా అవమానాలు ఎదురుకావడం. రక్షణ కల్పించాల్సిన పోలీసుల నుండి చివరకు న్యాయవ్యవస్థ నుండి కూడా బాధిత మహిళలకు ఈ తరహా దుస్థితి ఎదురవుతోందన్నది ఒక అధ్యయన సారాంశం!
ఇలా ఎన్నాళ్లు? ఆకాశంలో సగమని కీర్తిస్తూనే అవమానాల ఘనంగా మార్చడం దేనికి సంకేతం? హింసించడం, వేధించడం, అవమానపరచడమే కాదు, అటువంటి సంఘటనలను చూసీ చూడనట్టుగా వ్యవహరించడం కూడా మనువాద, పురుషాహంకార భావజాలమే! ఈ విష సంస్కృతి నుండి, దాని కుక్కమూతి పిందెల నుండి మన సమాజం బయటపడాలి. అదే విధంగా మాటల మాయలో, నినాదాల ఉచ్చులో పడకుండా నిజమైన సాధికారితను సాధించుకోవడానికి మహిళాలోకం కదలాలి. అన్ని రంగాల్లో సాధించే ఆ సాధికారతే మహిళలకు నిజమైన రక్ష! ఆ లక్ష్య సాధన కోసం జరిగే పోరాటాల్లో భాగస్వాములు కావడం, బలపరచడం ప్రగతిశీల, అభ్యుదయ శక్తుల కనీస బాధ్యత!