
- నీట మునిగిన వరి
- నేల మట్టమైన మామిడి, అరటి, మొక్కజన్న
- చెట్టు కూలి మహిళ మృతి
ప్రజాశక్తి-యంత్రాంగం : అకాల వర్షం అన్నదాతలను నట్టేట ముంచింది. ఆరుగాలం శ్రమించిన రైతుకు కన్నీరే మిగిల్చింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చేతికొచ్చిన పంటలను దెబ్బతీసింది. శుక్ర, శనివారాల్లో కురిసిన భారీ వర్షం, వడగళ్లు, ఈదుగుగాలులకు చేతికొచ్చిన పంట నీటిపాలైంది. భారీగా పంట నష్టం సంభవించింది. మొక్కజన్న, పొగాకు, పిందె దశలో ఉన్న పెసర, మామిడి పంటలకు నష్టం వాటిల్లింది. మిరప రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. వరి పంట కోసి కుప్పలు వేయడంతో ఓదెలు తడి ముద్దయ్యాయి. అరటి చెట్లు గెలలతో సహా విరిగిపడ్డాయి. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో వరి, మామిడి, మిర్చి, మొక్కజన్న, పొగాకు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి గ్రామంలో ఈదురు గాలులకు చెట్టు కూలి రేకుషెడ్డుపై పడడంతో గ్రామానికి చెందిన సంధ్య (37) అక్కడికక్కడే మఅతి చెందారు. నూజివీడు మండలంలోని పోతిరెడ్డిపల్లి, గొల్లపల్లి, తుక్కులూరు తదితర గ్రామాల్లో సుమారు వంద ఎకరాల్లో పొగాకు పంట దెబ్బతింది. వర్షాల కారణంగా పందిళ్లపై ఉన్న పొగాకు పూర్తిగా తడిసింది. పాలిథిన్ పరదాలు అద్దెకు తీసుకొచ్చి కప్పినప్పటికీ ప్రయోజనం లేకుండాపోయిందని రైతులు వాపోయారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలంలోని బాలాయపల్లి, పాకపూడి, గొట్టకాడు, మన్నూరు, నిండలి, వెంగమాంబపురం, యాచవరం, నిడిగల్లు, పాపిరెడ్డిపల్లి గ్రామాల్లో 260 ఎకరాల్లో వరి పైరు నీట మునిగింది. 70 శాతంపైగా కంకులు రాలిపోయి నీటిలో కలిసిపోయాయి. 150 ఎకరాల్లో మామిడికి నష్టం వాటిల్లింది. శ్రీకాళహస్తి రూరల్ అమ్మచెరువు గ్రామంలో పిడుగుపాటుకు మూడు పశువులు మృతి చెందాయి. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం అంచులవారిపాలెంలో మామిడి తోటలు నేలకొరిగాయి. మామిడి పూత, పిందెలు రాలిపోయాయి. ఈదురు గాలులకు అద్దంకి నార్కెట్‌పల్లి రహదారిపై లారీ బోల్తా పడడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. కోళ్లపారం కుప్పకూలిపోవడంతో సుమారు 700 కోళ్లు చనిపోయాయి. గుంటూరు జిల్లాలో మిరప, పొగాకు పంటలు దెబ్బతిన్నాయి. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గ పరిధిలోని బుక్కరాయసముద్రం, శింగనమల, పుట్లూరులో వడగళ్ల వాన కురిసింది. ఈదరుగాలులతో కూడిన వడగళ్ల వాన కురవడంతో మామిడి, అరటి, మునగ చెట్లు నేలకూలాయి. మొక్కల నర్సరీలు నేల మట్టం అయ్యాయి. ప్రకాశం జిల్లా దర్శిలో వరి ఓదెలు తడిసి ముద్దయ్యాయి. కొత్తపల్లి, తాళ్ళూరు మండలంలోని బద్దికూరపాడు, చింతలపాలెం గ్రామాలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. బాపట్ల జిల్లా భట్టిప్రోలులో రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి మొక్కజన్న పంట దెబ్బతింది. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. వీరఘట్టం మండలంలో అరటి పంట నేలమట్టమైంది. సీతంపేట, మక్కువ, సాలూరు, రామభద్రపురం బబ్బిలి, గరివిడి, చీపురుపల్లి, విజయనగరం బాడంగితెర్లాం, మెరకముడిదాం, లక్కవరపుకోటలో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. పలుచోట్ల పిడుగులు పడ్డాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో రోజంతా వర్షం పడింది. వర్షానికి డుంబ్రిగుడలో ఎన్‌హెచ్ 516 రోడ్డు బురద మయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో భారీ వర్షం కురిసింది. కేడీ పేట, నర్సీపట్నం రోడ్డు మార్గంలో భారీ చెట్టు విరిగి పడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈదురుగాలులకు కోటవురట్లలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. విశాఖలో చిరు జల్లులు పడ్డాయి. కృష్ణా జిల్లా వీరులపాడు మండలంలో 950 ఎకరాల్లో మిర్చి, 1100 ఎకరాల్లో మొక్కజన్న పంటలకు నష్టం వాటిల్లింది. విజయవాడ రూరల్ మండలంలో మామిడి నేలరాలాయి. శ్రీకాకుళంలో పలుచోట్ల మోస్తరు వర్షం కురిసింది.





