
బర్మింగ్‌హామ్ : కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ సిగలో మరో స్వర్ణం చేరింది. గురువారం రాత్రి జరిగిన పురుషుల పారా హెవీ వెయిట్‌లిఫ్టింగ్ కేటగిరీలో సుధీర్ బంగారు పతకం సాధించాడు. దీంతో భారత్ 6 బంగారు పతకాలను గెలిచినట్లయింది. 134.5 పాయింట్లతో సుధీర్ బంగారు పతాకాన్ని గెలుచుకోగా.. నైజీరియాకి చెందిన క్రిస్టియన్ 133.6 పాయింట్లతో రజతం, ఇంగ్లాండ్ పారా వెయిట్‌లిఫ్టర్ మిక్కీ యులే కాంస్య పతకం దక్కించుకున్నాడు. తొలి ప్రయత్నంలో 208 కేజీలు ఎత్తిన సుధీర్ తన రెండో విడతలో 212 కేజీలు ఎత్తేసి 134.5 పాయింట్లను సాధించాడు. అదేవిధంగా పురుషుల లాంగ్ జంప్ లో మురళీ శ్రీ శంకర్ సిల్వర్ మెడల్ ను సొంతం చేసుకున్నారు. మొత్తంగా ఇప్పటి వరకు భారత్ కు వచ్చిన పతకాల సంఖ్య 20కి చేరింది. ఆరు బంగారు, ఏడు రజతం, ఏడు కాంస్య పతకాలు ఉన్నాయి. సుధీర్ బంగారు పతకం సాధించడంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ, కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పురి శుభాకాంక్షలు తెలిపారు. మురళీ శ్రీ శంకర్ కు ప్రధాని మోడీ శుక్రవారం అభినందనలు తెలిపారు. ఈ గెలుపు ప్రత్యేకం అంటూ కొనియాడారు.