Mar 28,2023 00:27
కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తున్న జడ్‌పిటిసి బండ్ల తిరుమలాదేవి

ప్రజాశక్తి-వేటపాలెం: స్థానిక బండ్ల ఆదెమ్మ మెమోరియల్‌ ప్రాథమిక వైద్యశాల డాక్టర్‌ ప్రభాకర్‌పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని మండల జడ్‌పిటిసి బండ్ల తిరుమలాదేవి డిమాండ్‌ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ స్పందన కార్యక్రమానికి వెళ్లి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా తిరుమలాదేవి కలెక్టర్‌ విజరుకృష్ణన్‌తో మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం మూడున్నర వరకు ప్రాథమిక వైద్యశాల ఆఫీసులోనే తోటి ఆఫీసు సిబ్బందితో మద్యం సేవించడాన్ని సిబ్బంది, స్థానికులు గమనించి పోలీసుకు చరవాణి ద్వారా తెలియపరిచారన్నారు. సంబంధిత పోలీసు వారు వచ్చి పరిశీలించగా వారిని బ్రతిమలాడుకుని సర్దుబాటు చేసుకున్నారన్నారు. డాక్టర్‌ ప్రభాకర్‌ యూడిసి శ్రీనివాస్‌, హెల్త్‌ అసిస్టెంట్‌ నుంచి సూపర్‌వైజర్‌గా ప్రమోషన్‌ పొందిన పిచ్చయ్య కలిసి హాస్పటల్‌ ఆఫీస్‌ రూమ్‌లోనే మద్యం సేవించి నానా రభస చేస్తూ, గోలగోల చేస్తుండగా స్థానికులు, హాస్పటల్‌ సిబ్బంది గమనించి ప్రశ్నించగా వారిని నానా బూతులు తిడుతూ మద్యం మత్తులో చొక్కా కూడా లేకుండా హాస్పిటల్‌ నుంచి బయటకు వచ్చారు. వైద్యం సరిగా చేయడం లేదని, పేషెంట్స్‌ ఫ్రెండ్లీగా ఉండటం లేదని జనవరి నెలలో ప్రకాశం జిల్లాలో జడ్‌పి ఛైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ అధ్యక్షతన జరిగిన స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో డిఎంహెచ్‌ఒ విజయమ్మకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. ప్రతిరోజూ డాక్టర్‌ హాస్పటల్‌కు ఆలస్యంగా రావడం, ఆల్కహాల్‌ తీసుకొని అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ సిబ్బందిని, వైద్యం కోసం వచ్చిన పేషెంట్లను ఇష్టానుసారం మాట్లాడుతూ బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. వైద్యం కోసం వచ్చిన పేషెంట్స్‌ను ఎక్కువసేపు వేచిఉండేలా చేయటం, వైద్యం చేయాల్సిన సమయంలో ఫోన్‌ మాట్లాడుకుంటూ కాలక్షేపం చేయడం, హాస్పిటల్‌ అటెండెన్స్‌ పద్ధతి ప్రకారం వాడకపోవడం, ఎఫ్‌ఆర్‌ఎస్‌ అటెండర్స్‌కు సంబంధించిన యాప్‌ లొకేషన్‌లో ఉండకుండా మిస్‌ బిహేవ్‌ చేయటం, సీనియర్‌ అసిస్టెంట్‌ శ్రీనివాసరావు ద్వారా పర్సనల్‌ పాస్వర్డ్‌ ఏర్పాటు చేసుకొని తన వ్యక్తిగత అవసరాలకు వాడుకోవడం, హాస్పటల్‌ సిబ్బంది అయిన ఎంఎల్‌హెచ్‌పిఎస్‌, ఏఎన్‌పిఎస్‌ వైద్యం కోసం వచ్చిన పేషెంట్లను కులము, గోత్రము అడిగి మరీ వైద్యం చేయడం, నానా రకాల బూతు మాటలు మాట్లాడుతూ ఉండటం, వైద్యం సరిగ్గా అందించకపోవడం తదితర అంశాలపై గతంలో స్పందన ద్వారా కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సిబ్బందికి తనకు నచ్చిన వారికి సెలవు ఇచ్చి, నచ్చని వారిని ఇబ్బందులు గురిచేస్తుంటారన్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా నిరుపేదలైన బడుగు బలహీన వర్గాల చెందినవారు జీవిస్తుంటారని, అత్యవసర సమయంలో డాక్టర్‌ సరిగా విధులకు హాజరు కాకపోవడం వల్ల వైద్యం నిమిత్తం పందిళ్లపల్లి, చీరాల వెళుతుంటారన్నారు. గత రెండు పర్యాయాలు తాను మండల పరిషత్‌ అధ్యక్షులుగా ఉన్నప్పుడు హాస్పటల్‌కి చైర్మన్‌గా కొనసాగానని, ఆ సమయంలో సుమారు ప్రతిరోజు 130 నుంచి 150 వరకు ఓపీలు నడిచేవని, ప్రస్తుతం కేవలం 10 నుంచి 20 మాత్రమే ఓపి నడుస్తున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి డాక్టర్‌, సిబ్బందిపై వెంటనే శాఖా పరమైన చర్యలు తీసుకొని వారిని శిక్షించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్‌ని వేటపాలెం జడ్పిటిసి బండ్ల తిరుమలాదేవి కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో రామన్నపేట మూడో వార్డు మెంబర్‌ బులసల రామలక్ష్మి, బండ్ల బాబు, పర్వతరెడ్డి, రేణుక పాల్గొన్నారు.