
ప్రజాశక్తి-సత్తెనపల్లి : భావన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుండి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు మళ్లించిన రూ.754 కోట్లను బోర్డుకు తిరిగివ్వాలని భవన, ఇతర నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూనియన్ పల్నాడు జిల్లా రెండో మహాసభ పట్టణంలోని గరికపాటి విజయబాబు ప్రాంగణంలో (పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం)లో ఆదివారం నిర్వహించారు. అధ్యక్షవర్గంగా షేక్ పెదమీరా, ఎ.ఆంజనేయులు వ్యవహరించగా ముఖ్య అతిథిగా హాజరైన నరసింహారావు మాట్లాడుతూ పల్నాడు జిల్లాలోని రెండు లక్షల మంది భవన నిర్మాణ కార్మికులున్నారని, వీరు మూడేళ్లుగా ఇసుక కొరత, కరోనా లాక్డౌన్, నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదలతో పనులు కోల్పో యారని, కుటుంబాలు గడవడం కష్టమవు తోందని చెప్పారు. అనేక మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలనూ ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో కార్మికులకు ప్రభుత్వం సాయపడకపోగా ఉన్న నిధులనూ దారిమళ్లిచడం దారుణమన్నారు. ఈ డబ్బు ప్రతిపైసా కార్మికులకు దక్కే వరకూ యూని యన్ పోరాడుతుందని స్పష్టం చేశారు. యూని యన్ రాష్ట్ర కార్యదర్శి ఆర్వి.నరసింహారావు మాట్లాడుతూ సంక్షేమ బోర్డు నిధులు రూ.450 కోట్లను గతంలో చంద్రబాబు చంద్రన్న బీమా పథకానికి మళ్లించగా సిఐటియు పోరాడిందని, అప్పుడు ఆ ఆందోళనకు మద్దతిచ్చిన అప్పటి ప్రతిపక్ష వైసిపి ఇప్పుడు అదే పని చేస్తోందని విమర్శించారు. సంక్షేమ బోర్డు నిధులను ఇతర అవసరాలకు ఖర్చు చేయవద్దని సుప్రీంకోర్టు తీర్పునూ పాలకులు పట్టించుకోవడం లేదని అన్నారు. దీనిపై ఆందోళనలు నిర్వహించేందుకు వచ్చేనెలలో నిర్వహించి రాష్ట్ర మహాసభలో కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు.
ఇసుకును ఉచితంగా ఇవ్వాలని, నిర్మాణ సామగ్రి ధరలను అదుపు చేయాలనే డిమాండ్లతో తీర్మానాలను మహాసభ ఆమోదించింది. తొలుత యూనియన్ జెండాను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి నరసింహారావు ఆవిష్కరించారు. కరోనాతో మృతి చెందిన, ఆత్మహత్య చేసుకున్న, ఇతర కారణాలతో మరణించిన కార్మికులు, నాయకులకు మహాసభ సంతాపం తెలిపింది. సిఐటియు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.ఆంజనేయులునాయక్, నాయకులు ఆర్.పురుషోత్తం, జి.మల్లీశ్వరి సౌహార్ధ సందేశాలిచ్చారు.
45 మందితో నూతన కమిటీ
45 మందితో నూతన కమిట, వీరిలో ఏడుగురితో కార్యదర్శివర్గం ఎన్నికైంది. అధ్యక్ష కార్యదర్శులుగా అవ్వారు ప్రసాద్‌రావు, సిలార్ మసూద్ తిరిగి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా కె.సురేష్, ఆర్.ఆంజనేయులు, సహాయ కార్యదర్శులుగా పి.కృష్ణ, సిహెచ్.యేసయ్య, కోశాధికారిగా ఎ.ఆంజనేయులు ఎన్నికయ్యారు. సీనియర్ నాయకులు ఆర్.పురుషోత్తంను సత్కరించారు. ప్రజాసంఘాల నాయకులు జి.రవిబాబు, డి.విమల, జి.రజిని, షేక్ సైదులు, ఫాతిమా, సుభాని, మహేష్ పాల్గొన్నారు.