Oct 13,2021 18:27

ముంబయి : డ్రగ్స్‌ కేసులో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌ అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆర్యన్‌ఖాన్‌ తరపు న్యాయవాది అమిత్‌దేశాయ్ ఎన్సీబీ అధికారులు ఇచ్చిన రిపోర్టు ప్రకారం తన వాదనలు వినిపించారు. ఆయన వాదనల సారంశమేమిటంటే.. 'ఆర్యన్‌ ఖాన్‌ దగ్గర ఏమీ దొరకలేదని, డబ్బులు కూడా దొరకలేదని ఎన్‌సిబి అధికారులే రిపోర్టులో రాశారు. మరి డబ్బులే లేని అతనికి డ్రగ్స్‌ను కొనడం, అమ్మడం లాంటివి ఎలా సాధ్యం? అసలు అక్కడకు డ్రగ్స్‌ తీసుకోవడానికే వెళ్లాడని ఎలా చెప్తారు? అంటూ ముంబైలోని ప్రత్యేక ఎన్‌డీపీఎస్‌ కోర్టులో అమిత్‌ దేశాయ్ పలు ప్రశ్నలను లేవనెత్తారు. ఎన్‌సిబి అధికారులు కోర్టుకు సమర్పించిన రిపోర్టులో పలు అంశాలను ప్రస్తావిస్తూ, పంచనామాను చదువుతూ వరుస ప్రశ్నాస్త్రాలు సంధించారు.
ఛోకర్‌, ఇస్మీత్‌, అర్బాజ్‌ నుంచి స్వల్ప మొత్తంలో మాదకద్రవ్యాలు దొరికాయి కానీ.. ఆర్యన్‌ఖాన్‌ నుంచి మాత్రం ఏమీ లభ్యమవ్వలేదేని ఆయన గుర్తు చేశారు. ఆర్యన్‌ఖాన్‌ వద్ద డ్రగ్స్‌ ఉన్నాయన్న సమాచారం పూర్తి అవాస్తవమని.. దానికి ఎన్‌సిబి ఇచ్చిన నివేదికే సాక్ష్యమని ఆయన తేల్చి చెప్పారు. గతంలో కొన్ని టెక్నికల్‌ అంశాల వల్లే.. మెజిస్ట్రేట్‌ కోర్టు ఆర్యన్‌ఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌ను రద్దు చేసిందనీ, ఎన్సీబీకి కూడా కస్టడీకి కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు.
'వాస్తవానికి ఆర్యన్‌కు ఇష్టం లేకపోయినా తన స్నేహితుడు ప్రతీక్‌గబ్బా ఆహ్వానం మేరకు ఆ పార్టీకి వెళ్లాడని ఆయన అన్నారు. అయితే అధికారులు ఆర్యన్‌ఖాన్‌నే అరెస్టు చేశారు. మరి తనని పిలిచిన ఫ్రెండ్‌ని ఎందుకు ఇప్పటివరకు అరెస్టు చేయలేదు? ఎందుకు ప్రశ్నించలేదు అని ఆయన వ్యాఖ్యానించారు. 'మారుతున్న కాలానికి అనుగుణంగా మనం చాలా చట్టాలను మార్చుకున్నాం. గతంలో మాదకద్రవ్యాలు తీసుకుంటే ఐదేళ్లు జైలు శిక్ష ఉండేది. 2001వ సంవత్సరంలో దీన్ని ఏడాదికి తగ్గించుకున్నాం. ఐక్యరాజ్య సమితి సూచనల తర్వాత చాలా దేశాల్లో గంజాయిని ప్రమాదకర డ్రగ్స్‌ లిస్ట్‌లోంచి తీసేశాయి. వీళ్లంతా ఎదుగుతున్న పిల్లలు. బెయిల్‌ ఇవ్వకుండా వీళ్లను శిక్షించొద్దు. ఇప్పటికే చాలా ఇబ్బందులు పడ్డారు. జరిగిన పరిణామాలతో పాఠాలు నేర్చుకుంటారు.' .. అంటూ అమిత్‌ దేశాయ్ వాదనలు వినిపించారు.