Nov 25,2021 08:12

పాట్నా : ఎటిఎం నుండి డబ్బులు దోచుకునేందుకు వెళ్లిన దొంగలు .. ఆ ప్రయత్నం విఫలమవ్వడంతో ఏకంగా ఎటిఎం మిషన్‌ను తీసుకెళ్లిన ఘటన బీహార్‌లో జరిగింది. తూర్పు చంపారన్‌ జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఎటిఎంల నుండి డబ్బులు లూటీ చేసేందుకు నలుగురు దొంగలు పక్కా పన్నాగం పన్నారు. ఆదివారం రాత్రి స్కార్పియోలో పిఎన్‌బి ఎటిఎంకు వెళ్లగా.. పోలీసులు గస్తీ కాస్తుండటంతో వెనుదిరిగారు. ఆ తర్వాత ఎస్‌బిఐ ఎటిఎం వద్దకు వెళ్లారు. అక్కడ సిసిటివి ఫుటేజ్‌పై పెయింట్‌ చల్లారు. తర్వాత ఎటిఎం నుండి డబ్బులు తీసేందుకు సుమారు గంటన్నర పాటు ప్రయత్నించగా.. వారి పన్నాగం ఫలించలేదు. చివరికి విసిగిపోయి ఎటిఎం మిషన్‌నే ఎత్తుకు వెళ్లారు. ఈ ఎటిఎం దొంగతనం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సిసిటివి ఫుటేజ్‌లు పరిశీలిస్తున్నారు. అందులో స్కారియో కారు మాత్రమే కనిపించింది. వారు ఎటిఎంలోకి వెళ్లినప్పటి నుండి గంటన్నర ప్రయత్నించి.. చివరకు నగదు రాక ఎటిఎం మిషన్‌ను తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు ఇంకా దొరకలేదని చెప్పారు. అయితే ఈ ఎటిఎంలో దాదాపు రూ.35,77,000 ఉన్నాయని బ్యాంకు అధికారి తెలిపారు. కొంత డబ్బు ప్రజలు తీసేయగా.. ఇంకా ఎంత నగదు అందులో ఉందే తెలియాల్సి ఉందని చెప్పారు.