May 17,2022 20:53

- గ్రీన్‌ పవర్‌కు రాష్ట్రంలో అపార అవకాశాలు
ప్రజాశక్తి- కర్నూలు ప్రతినిధి:
ఇంటిగ్రేటెడ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ స్టోరేజ్‌ (ఐఆర్‌ఇఎస్‌) ప్రాజెక్టు దేశానికే మార్గదర్శనం కానుందని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. ఒకే యూనిట్‌లో సౌర, వవన, హైడల్‌ విద్యుదుత్పాదన జరగనుండడం దీని ప్రత్యేకతని తెలిపారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుమ్మటం తండా వద్ద గ్రీన్‌కో చేపట్టిన ఐఆర్‌ఇఎస్‌ ప్రాజెక్ట్‌కు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ 1,680 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ సామర్థ్యం, మూడు వేల మెగావాట్ల సౌరశక్తి, 550 మెగావాట్ల పవన విద్యుత్తు సామర్థ్యంతో మూడు బిలియన్‌ డాలర్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో గ్రీన్‌ ఎనర్జీకి అపార అవకాశాలు ఉన్నాయన్నారు. ఇందుకు భౌగోళిక పరిస్థితులు కూడా పూర్తి అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి సంస్థలకు దేశంలోలేని విధంగా రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్న సానుకూల వాతావరణం, సదుపాయాల వల్ల 33 వేల మెగావాట్ల గ్రీన్‌ విద్యుదుత్పత్తికి అవకాశం ఉందని తెలిపారు. ఒక అద్భుతమైన చారిత్రక సన్నివేశం ఆవిష్కృతం కానుందన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఐఆర్‌ఇఎస్‌ ప్రాజెక్టు 5,230 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు కానుందని, తక్కువ ధరకే, స్థిరమైన, అనువైన, ఇరవై నాలుగు గంటలూ నిరంతర గ్రీన్‌ విద్యుత్తును అందిస్తుందని తెలిపారు. రోజంతా పునరుత్పాదక శక్తి ఉత్తత్పి చేయడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకతని తెలిపారు. రానున్న రోజుల్లో మొత్తం దేశంలోనే ఇటువంటి ప్రక్రియకు ఈ ప్రాజెక్టు నాందిగా నిలవనుందన్నారు. విద్యుదుత్పత్తి రంగంలో శిలాజ ఇంధనాల వినియోగం పూర్తిగా మారిపోయి, పునరుత్పాదక శక్తి ఇంధన విభాగమే ముందంజలో నిలవనుందని పేర్కొన్నారు. కాలుష్య రహిత గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి కానుందన్నారు. రానున్న రోజుల్లో ఇది ఒక వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టనుందని పేర్కొన్నారు. తొలుత పైలాన్‌ను, శిలాఫలకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించి జెండా వందనం చేశారు. కార్యక్రమంలో ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, గ్రీన్‌కో ఎండి అనిల్‌ చలమలశెట్టి, జెఎండి మహేష్‌కొల్లి, ఎంపి పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.