May 18,2022 00:03

నమూనాను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌

చారిత్రక సన్నివేశం ఆవిష్కృతం కానుంది
.గీన్‌కో ఐఆర్‌ఇఎస్‌ ప్రాజెక్టు శంకుస్థాపనలో సిఎం జగన్‌
ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి:
రెన్యూవబుల్‌ ఎనర్జీ స్టోరేజ్‌(ఐఆర్‌ఇఎస్‌) ప్రాజెక్టు దేశానికే మార్గదర్శనం కానుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుమ్మటం తండా వద్ద గ్రీన్‌ కో చేపట్టిన ఐఆర్‌ఇఎస్‌ ప్రాజెక్ట్‌కు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసి సభలో సిఎం మాట్లాడుతూ ఎపిలో గ్రీన్‌ ఎనర్జీకి ఆపార అవకాశాలు ఉన్నాయన్నారు. భౌగోళిక పరిస్థితులు కూడా అందుకు పూర్తి అనుకూలంగా ఉన్నాయని, గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి సంస్థలకు దేశంలో లేని విధంగా రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. ఒక అద్భుతమైన చారిత్రక సన్నివేశం ఆవిష్కృతం కానుందన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఐఆర్‌ఇఎస్‌ ప్రాజెక్టు 5230 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు కానుందని, తక్కువ ధరకే, స్థిరమైన, అనువైన, ఇరవై నాలుగు గంటల నిరంతర గ్రీన్‌ విద్యుత్‌ను అందిస్తుందని తెలిపారు. రోజంతా పునరుత్పాదక శక్తి ఉత్తత్పి చేయడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకతన్నారు. రానున్న రోజుల్లో మొత్తం దేశంలోనే ఈ ప్రక్రియకు ఈ ప్రాజెక్టు నాందిగా నిలవనుందన్నారు. గ్రీన్‌కో ఎండి అనిల్‌ చలమలశెట్టి మాట్లాడుతూ విద్యుత్‌ ఉత్పత్తి రంగానికి ఎపిలో అనుకూల వాతావరణం ఉందన్నారు. ఈ ప్రాజెక్టుతో భారీ పరిశ్రమల్లో నిల్వ ఒప్పందాలకు గ్రీన్‌కో మార్గదర్శకత్వం వహించనుందన్నారు. ఈ ప్రాజెక్ట్‌ 2023 చివర్లో కార్యకలాపాలు ప్రారంభించనుందన్నారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి మాట్లాడుతూ ఓర్వకల్‌ ప్రాంతంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒకే చోట హైడ్రో, సోలార్‌, విండ్‌ పవర్‌ ఉత్పత్తి చేసే ప్రాజెక్టు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి పాణ్యం నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం భూములిచ్చిన రైతులకు కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలుతున్నారన్నారు. భవిష్యత్తులో ఓర్వకల్‌ మెగా ఇండిస్టియల్‌ హబ్‌లో మరిన్ని ప్రాజెక్టులు రావాలని ఆకాంక్షించారు. తొలుత పైలాన్‌ను, శిలాపలకాన్ని సిఎం ఆవిష్కరించి జెండా వందనం చేశారు. ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, గ్రీన్‌ కోసం ఎండి అనిల్‌ చలమలశెట్టి, జెఎండి మహేష్‌ కొల్లి, ఎంపి పోచా బ్రహ్మానందరెడ్డి, మేఘా సంస్థ అధినేత కృష్ణారెడ్డి, కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు పాల్గొన్నారు.
ఘన స్వాగతం... వీడ్కోలు...
ఐఆర్‌ఐఎస్‌ ప్రాజెక్టు శంకుస్థాపన కోసం మంగళవారం ఉదయం 10:42 గంటలకు ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు, కర్నూలు రేంజ్‌ డీఐజీ ఎస్‌ సెంథిల్‌ కుమార్‌, ఎమ్మెల్యేలు హఫీజ్‌ ఖాన్‌, సుధాకర్‌, కర్నూలు మేయర్‌ బివై.రామయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ భార్గవ్‌ తేజ్‌ తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేసి సిఎంకు స్వాగతం పలికారు. 11.17కు గుమ్మటం తండా హెలీప్యాడ్‌ వద్దకు సిఎం చేరుకోగా నంద్యాల ఎంపి పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, శిల్పా రవిచంద్రకిషోర్‌ రెడ్డి, కంగాటి శ్రీదేవి, తొగూరు ఆర్థర్‌, సాయి ప్రసాద్‌ రెడ్డి, బాలనాగిరెడ్డి, శాప్‌ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ప్రభుత్వ విప్‌ వెన్నపూస గోపాల్‌ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్‌ బాషా, ఎస్‌పి సిహెచ్‌.సుధీర్‌ కుమార్‌ రెడ్డి, జెసి రామసుందర్‌రెడ్డి, జడ్‌పి ఛైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి, మార్క్‌ఫెడ్‌ ఛైర్మెన్‌ నాగిరెడ్డి, కుడా ఛైర్మన్‌ కోట్ల హర్షవర్ధన్‌ రెడ్డి, మాజీ ఎంపి బుట్టా రేణుక, మాజీ ఎమ్మెల్యే ఎస్‌వి మోహన్‌ రెడ్డి స్వాగతం పలికారు. కార్యక్రమాన్ని ముగించుకుని మధ్యాహ్నం 12:52 గంటలకు ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి గన్నవరానికి బయల్దేరిన సిఎంకు ప్రజాప్రతినిధులు, అధికారులు వీడ్కోలు పలికారు.