Nov 25,2021 09:24

ఇస్లామాబాద్‌ : '' దేశాన్ని నడిపించేంత డబ్బు లేదు.. అప్పులు చేయాల్సి వస్తోంది '' అని పాకిస్థాన్‌ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ అన్నారు. పాకిస్థాన్‌లో 22 కోట్ల జనాభా ఉంటే.. అందులో కేవలం 30 లక్షల మంది మాత్రమే పన్నులు చెల్లిస్తున్నట్లు ఆ దేశ ఆర్థిక సలహాదారు షౌకత్‌ టరిన్‌ గతంలో వెల్లడించారు. వారిలో 15 లక్షల మందికి పన్నులు వెంటనే చెల్లించాలని.. లేదంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని నోటీసులు కూడా జారీ చేశారు. మంగళవారం ఇస్లామాబాద్‌లోని ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ రెవెన్యూలో ట్రాక్‌ అండ్‌ ట్రేస్‌ సిస్టమ్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశ ఆర్థిక వ్యవస్థ గురించి ప్రస్తావించారు.

' మన దేశంలో ఉన్న అతిపెద్ద సమస్య ఏంటంటే.. దేశాన్ని ముందుకు నడిపించడానికి కావాల్సిన ధనం మన వద్ద లేకపోవడమే. అందుకే అప్పులు చేయాల్సి వస్తోంది. అప్పుల భారం పెరిగిపోతుండటం.. దేశంలో పన్నులు సరిగా వసూలు కాకపోవడం, 'జాతీయ భద్రత' అంశంగా మారింది. గత ప్రభుత్వాలు విపరీతంగా అప్పులు తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. ఆర్థిక వనరులు లేకపోవడంతో ప్రజా సంక్షేమానికి బడ్జెట్‌ కేటాయించలేకపోతున్నాం. గత నాలుగు నెలల్లో ప్రభుత్వం 3.8 బిలియన్‌ డాలర్లు అప్పు చేసింది. ఈ అప్పుల ఊబి నుంచి పాకిస్థాన్‌ బయటపడాలంటే ప్రజలు పన్నులు చెల్లించాలి ' అని ఇమ్రాన్‌ఖాన్‌ విజ్ఞప్తి చేశారు.