
కదిరి టౌన్ : కేంద్రంలో పాలన సాగిస్తున్న బిజెపి అనాలోచిత నిర్ణయాలతో దేశంలో రోజురోజుకూ ఆర్థికమాద్యం పెరుగుతోందని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బివి.రాఘువులు పేర్కొన్నారు. మంగళవారం నాడు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో రోజురోజుకూ నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. ఇలాంటి సమయంలో జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రజా సమస్యలను చర్చించకుండా బిజెపి సభను తప్పుదోవ పట్టిస్తోందన్నారు. దీనికి ప్రధానమంత్రి మోడీ బాధ్యత వహించాలన్నారు. అదానీ కుంభకోణంపై ప్రతిపక్షాలు సమగ్ర దర్యాప్తుకు ఆదేశించమంటున్నా ప్రధాని మౌనంగా ఉండడం వెనుక ఆంతర్యం ఏమిటో ప్రజలకు చెప్పాలన్నారు. ఎల్‌ఐసి, స్టేట్‌బ్యాంకులను దివాలా తీయించేలా అదానీ మోసం చేశాడన్నారు. ప్రజల సొమ్ముకు రక్షణ కల్పించాల్సిన కేంద్రం అదానీ మోసానికి వత్తాసు పలికేలా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. అవినీతి, ప్రజా సమస్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే వారిని ఇబ్బంది పెట్టందుకు సిబిఐ, ఈడీలను ఉసిగొల్పుతోందన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇలా ప్రతిపక్షాలపై దాడులు చేయించడం సరికాదన్నారు. ఇక రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తుందన్నారు. జీవో నెంబర్ ఒకటిని తీసుకొచ్చి ప్రతిపక్షాల గొంతునొక్కే కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు. రాష్ట్రం ప్రజలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా.? లేక నియంతృత్వ పాలనలో ఉన్నామా.? అనే విధంగా పాలనకొనసాగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి మారకుంటే తెలుగుదేశం పార్టీకి పట్టిన గతే పడుతుందన్నారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి బడా సుబ్బిరెడ్డి, సిపిఎం కదిరి పట్టణ కార్యదర్శి జిఎల్.నరసింహులు, ప్రజా సంఘాల నాయకులు సాంబశివ, బాబ్జాన్, జగన్మోహన్, ముస్తాక్, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.