Jun 10,2021 10:15

న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా చాప కింద నీరులా సాగుతోంది. గడిచిన 24 గంటల్లో 94,052 కొత్త కేసులు వెలుగు చూడగా...రికార్డు స్థాయిలో మరణాలు చోటుచేసుకున్నాయి. తాజాగా 6,148 మంది మృత్యువాత పడ్డారు. గరిష్ట సంఖ్యలో కేసులు నమోదు కావడానికి కారణం... బీహార్‌ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలేనని తెలుస్తోంది. ఇప్పటి వరకు 5500 మంది మాత్రమే చనిపోయారన్న రాష్ట్ర ఆరోగ్య శాఖ బుధవారం ఆ సంఖ్యను సవరిస్తూ 9,429 మంది చనిపోయారని తెలిపింది. అంటే 72 శాతం అధికమన్నమాట. బీహార్‌లో మరణాలను రాష్ట్ర ప్రభుత్వం తక్కువగా చూపిస్తోందని వస్తున్న వార్తలపై స్పందించిన హైకోర్టు సరైన లెక్కలు తేల్చాలని ఆదేశాలివ్వడంతో మరణాల సంఖ్యను సవరిస్తూ ప్రకటన చేసింది. దీంతో ఒక్కరోజులోనే రాష్ట్రంలో 3,951 మంది మరణించారు. ఈ సంఖ్య జాతీయ సంఖ్యపై ప్రభావితం చూపింది. మొత్తంగా దేశంలో 2,91,83,121 మంది కరోనా బారిన పడగా... 2,76,55,493 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు 3,59,676 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 11,67,952 క్రియా శీలక కేసులు మాత్రమే ఉన్నాయి. ఇప్పటి వరకు 24 కోట్ల వ్యాక్సిన్లు వినియోగమైనట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.