Sep 27,2021 14:29

ప్రజాశక్తి -సంతబమ్మాలి
గులాబ్‌ తుఫాన్‌ ప్రభావంతో ప్రజలు భయభ్రాంతులకు గురై, విద్యుత్‌ సరఫరా నిలిచిపోయి అల్లాడుతుంటే ఇదే అదునుగా భావించిన దొంగలు దేవాలయంలో చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన సంతబమ్మాళి మండలం లోని నరసాపురం పంచాయతీ బడే నరసాపురం గ్రామంలోని శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి దేవాలయంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు గ్రామ శివారు పొలాలు మధ్య ఉన్న అమ్మవారి ఆలయంలో సోమవారం రాత్రి దొంగతనం జరిగింది. తుఫాను సమయంలో విద్యుత్‌ కోతలు విధించడంతో అదునుచూసి ఓ ముఠా దేవాలయంలోని మూడు తాళాలు బద్దలు కొట్టి గర్భగుడిలోకి చొరబడ్డారు. హుండీని కొల్లగొట్టి, మైక్‌ సెట్‌ యాంప్లిఫైయర్‌ లను ఎత్తుకెళ్లారు. అంతేకాకుండా ఆనవాలు లేకుండా ఆలయం మొత్తం నూనె పోశారు. మంగళవారం ఉదయం దేవాలయం తెరిచేందుకు వెళ్లిన పూజారి చోరీకి గురైన విషయం గుర్తించి గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. రూ.20,000 వరకు చోరీకి గురైందని అంచనా వేస్తున్నారు. సంఘటనపై గ్రామ సర్పంచ్‌ భూషన్‌ రెడ్డి, గ్రామ పెద్దలు, గ్రామస్తులు విచారం వ్యక్తం చేసారు.దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు.