Oct 13,2021 07:25
  • దోచుకుంటున్న కార్పొరేట్‌ ఆస్పత్రులు
  • కేసులు, మరణాలు తక్కువ చేసి చూపుతున్న అధికారులు

ప్రజాశక్తి -యంత్రాంగం : రాష్ట్రంలో డెంగీ జ్వరం విజృంభిస్తోంది. పెద్ద సంఖ్యలో ప్రజలు డెంగీ బారిన పడుతున్నారు. పలువురు మృత్యువాత పడుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే, ప్రభుత్వ అధికారులు డెంగీ కేసులు, మరణాలను తక్కువ చేసి చూపుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. దీనిని అవకాశంగా తీసుకుని కార్పొరేట్‌ ఆస్పత్రుల ప్రజలను దోచుకుంటున్నాయి.


                                                         అధికారుల వైఖరిలా...

'విజయనగరానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్‌ చిట్టి రమణారావు కుమారుడు వైష్ణవ్‌ స్థానిక మిమ్స్‌లో ఎంబిబిఎస్‌ చదువుతున్నాడు. డెంగీ జ్వరంతో బాధపడుతూ సొంత ఆస్పత్రిలోనే చేరాడు. అప్పటికే ప్లేట్‌లెట్స్‌ తగ్గుముఖం పడుతున్నట్టు గమనించిన తండ్రి మెరుగైన వైద్యం కోసం విశాఖలోని సెవెన్‌ హిల్స్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తరువాత కూడా ప్లేట్‌లెట్స్‌ రికవరీ కాకపోవడంతో సెప్టెంబర్‌ 25న వైష్ణవ్‌ మృతి చెందాడు. అదే రోజు జియ్యమ్మవలస మండలం చినకుదమ గ్రామానికి చెందిన గొర్లె నరేష్‌ (బ్యాంకు ఉద్యోగి) ప్లేట్‌లెట్స్‌ తగ్గిపోవడంతో చనిపోయాడు. డెంగీ లక్షణాలతో బాధపడుతున్న కురుపాం మండల కేంద్రానికి చెందిన వారణాసి శ్రీలక్ష్మి (సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌) విశాఖపట్నంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతిచెందింది. విజయనగరంలోని బ్యాంకు కాలనీకి చెందిన ఏడో తరగతి విద్యార్థి గుడివాడ కార్తికేయ (12) డెంగీ లక్షణాలతో మరణించాడు. అయితే, అధికారులు మాత్రం వీటిని డెంగీ మరణా లుగా గుర్తించలేదు. తూర్పు గోదావరి జిల్లా తూర్పు గోదావరి జిల్లా కూనవరం మండలం పోచవరం పంచాయతీకి చెందిన 14 మంది డెంగ్యూ లక్షణా లతో గత రెండు నెలల్లో మరణించారు. ఈ మరణా లల్లో ఒక్క దానిని కూడా అధికారులు డెంగ్యూ మరణాలుగా గుర్తించలేదు. మిగిలిన జిల్లాల్లో కూడా ఇదే స్థితి. ప్రకాశం, గుంటూరు, కడప, నెల్లూరుతో పాటు ఇతర జిల్లాల్లో కూడా డెంగీ కేసులను తగ్గించిచూపుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి.

                                                            కార్పొరేట్‌ తీరిలా...

విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రిలోని లేబొరేటరీలో ఆర్‌డిపి (రేండమ్‌ డోనర్‌ ప్లేట్‌లెట్‌) మాత్రమే అందుబాటులో ఉంది. డోనర్‌ నుండి ఎక్కువ ప్లేట్‌లెట్స్‌ కావాల్సిన వారు ప్రైవేటు బ్లడ్‌బ్యాంకులను ఆశ్రయించాల్సివస్తోంది. వీటిలో ఒక ప్లేట్‌లెట్స్‌ బ్యాగుకు రూ.8 వేల నుంచి రూ.10 వేలకు వసూలు చేస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో ప్రయివేటు ఆస్పత్రుల్లో ప్లేట్‌లెట్స్‌ ఎక్కించడానికి, చికిత్స చేయడానికి రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు వసూలు చేస్తున్నారు. రోగి పరిస్థితి విషమంగా ఉంటే ఈ ఖర్చు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకూ ఉంటోంది.
గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో ఖాళీలు లేవు. దీంతో ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించక తప్పనిస్థితి. ఇక్కడ చికిత్సకోసం కనీసం లక్ష రూపాయలు ఖర్చు చేయాల్సిన స్థితి
పశ్చిమగోదావరి జిల్లాలో రెడ్‌క్రాస్‌లో ప్లేట్‌లెట్స్‌ వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుండగా, ప్రైవేటు బ్లడ్‌ బ్యాంకుల్లో రూ.2,500 వరకూ వసూలు చేస్తున్నారు. డెంగీ చికిత్సకు ప్రయివేటు ఆసుపత్రుల్లో రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకూ వసూలు చేస్తున్నారు.
కడప, కర్నూలు, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో ప్లేట్‌లెట్స్‌ ప్యాకెట్‌కు 10నుండి 15 వేలు వసూలు చేస్తున్నారు. డెంగీ లక్షణాలతో ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చేరితే 1.50 నుండి 2 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతోంది