
కర్నూలు నుంచి విజయవాడకు సరుకు
భారీ మొత్తంలో సీజ్
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : మాదక ద్రవ్యాలకు (డ్రగ్స్) వియజవాడ ప్రధాన కేంద్రంగా మారుతోంది. ఇటీవల ఎఫిడ్రిన్‌ను పోలీసులు భారీగా స్వాధీనం చేసుకోగా, తాజాగా విదేశాలలో అధికంగా వినియోగించే మెథాంఫేటమిన్ నగరంలోకి ప్రవేశించింది. విజయవాడ సమీపంలోని నున్నలో రూ.లక్షలు విలువ చేసే మెథాంఫేటమిన్‌ను భారీ మొత్తంలో మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు నుంచి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు ఈ డ్రగ్ సరఫరా అవుతోంది. అక్కడ ప్రధాన ఏజెంట్‌ను అదుపులోకి తీసుకున్న కర్నూలు సిసిఎస్ పోలీసులు ఫోన్ ట్రాకింగ్ ద్వారా విజయవాడ సమీపంలోని నున్న నుంచి ఆన్లైన్ బుకింగ్‌లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో కర్నూలు సిసిఎస్ పోలీసులు నున్న వచ్చి ఫోన్ సిగల్స్ ఆధారంగా వికాస్ కాలేజీ రోడ్డులోని చినకంచి వద్ద డ్రగ్స్‌తో యువకులున్నట్లు గుర్తించారు. పోలీసులు రావడంతో ముగ్గురు పరారవ్వగా, కె యశ్వంత్‌రెడ్డి పట్టుబడ్డాడు. ఆయన నుంచి భారీగా మెథాంఫేటమిన్ డ్రగ్‌తోపాటు ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా నున్న సెంటర్లోని ఒక షాపులో ఉన్న ఎ ఏకేశ్వర్రెడ్డిని, ఆ తర్వాత గుణదలకు చెందిన మరో యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన యువకులంతా బెంగళూరుతోపాటు ఇతర నగరాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వారు కావడం గమనార్హం. నున్నలో కర్నూలు సిసిఎస్ పోలీసులు మెరుపుదాడి చేసిన ఘటన స్థానికంగా సంచలనం కలిగించగా, విజయవాడ పోలీసులకు తెలియకపోవడం గమనార్హం. మెథాంఫేటమిన్ బెంగళూరు కేంద్రం నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు దిగుమతి అవుతోంది. మెథాంఫేటమిన్‌కు కర్నూలులో ప్రధాన ఏజెంట్ పని చేస్తున్నాడు. అతి అరుదుగా లభించే ఈ డ్రగ్‌ను యువత ఆన్లైన్లో బుకింగ్ చేసుకుని కొరియర్లో తెప్పించుకుంటున్నారు. ఒక్క నున్న నుంచే వందలాది మంది యువకులు ఈ డ్రగ్‌ను ఆన్లైన్లో బుకింగ్ చేసుకుని తెప్పించుకుంటున్నట్లు పోలీసుల కూపీలో తేలింది. స్థానికంగా ఒకే బజార్లో ఈ డ్రగ్‌ను వినియోగించే యువకులు 50 మంది ఉన్నట్టు గుర్తించారు. వారంతా 18 నుంచి 22 ఏళ్ల మధ్య వయస్కులే కావడం గమనార్హం.