Oct 04,2022 00:04

యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.వెంకటేశ్వర్లు

ప్రజాశక్తి-గుంటూరు:పెండింగ్‌లో ఉన్న 2 డిఎలను విడుదల చేయాలని యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. సోమావారం బ్రాడీపేటలోని సంఘ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 11వ పిఆర్‌సి తర్వాత కేంద్రం రెండు డిఎలు ప్రకటించిందని, రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటి కూడా ప్రకటించలేదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందని ప్రకటనలు చేస్తూ, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటే మాత్రం ఆర్థిక ఇబ్బందులని చెబుతున్నారని విమర్శించారు. గతంలో ఉన్న డిఎల బకాయిలు ఉపాధ్యాయుల, ఉద్యోగుల అకౌంట్లలోకి రాకుండానే ఇన్‌కం ట్యాక్స్‌ చెల్లించిన పరిస్థితి ఉందన్నారు. మున్సిపల్‌ ఉపాధ్యాయులకు 2009 నుంచి రావాల్సిన డిఎ ఎరియర్స్‌ పెండింగ్‌లో ఉన్నాయని, సిపిఎస్‌ ఉద్యోగుల డిఎ నగదు బకాయిలు కూడా ఇంత వరకూ చెల్లించలేదని తెలిపారు. ఉద్యోగుల బకాయిలను పెండింగ్‌లో పెట్టి ఆర్థిక ఇబ్బందులకు గురి చేయటం తగదన్నారు. పిఆర్‌సి చర్చల సందర్భంగా తదుపరి ఆర్థిక శాఖ అధికారులతో చర్చల సందర్భంగా బకాయిలు 2 నెలల్లో చెల్లిస్తామని చేసిన వాగ్దానం అమలు చేయాలని కోరారు. యుటిఎఫ్‌ ప్రచురణల విభాగం రాష్ట్ర ఛైర్మన్‌ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ పాఠశాలల ప్రారంభానికి ముందే బదిలీలు, ప్రమోషన్లు పూర్తి చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికి మూడు నెలలు గడిచినా వాటిపై స్పష్టమైన విధానం ప్రకటించలేదన్నారు. ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో జిల్లా అధ్యక్షులు బి.ఆదిలక్ష్మి, ప్రధాన కార్యదర్శి ఎం.కళాధర్‌, జిల్లా కార్యదర్శి సిహెచ్‌.ఆదినారాయణ, ఆడిట్‌ కమిటీ సభ్యులు ధనరాజారావు పాల్గొన్నారు.