Nov 19,2022 22:51

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ కోర్సుల్లో సీట్లు భారీగా మిగిలాయి. సగానికి సగం కూడా భర్తీ కాలేదు. రాష్ట్రంలోని 14 విశ్వవిద్యాలయాల పరిధిలోని కళాశాలల్లో అందుబాటులో ఉన్న మొత్తం 3,46,777 సీట్లకు 2,04,299 భర్తీ కాలేదు. డిగ్రీ అడ్మిషన్ల కోసం చేపట్టిన కౌన్సిలింగ్‌ శనివారంతో ముగిసింది. మూడు దశల్లో జరిగిన ఈ కౌన్సిలింగ్‌లో 1,42,478 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. తొలిదశలో 84,549 సీట్లు, ద్వితీయ దశలో 38,645 సీట్లు, తుదిదశలో 18,284 సీట్లలోనే విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ప్రభుత్వ కళాశాలల్లో 57,061 సీట్లు ఉండగా 26,227 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందగా.. ప్రైవేట్‌ ఎయిడెడ్‌లో 23,939 సీట్లకు7276, ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌లో 2,62,970 సీట్లకు 1,06,650 విద్యార్థులు చేరారు. విశ్వవిద్యాలయాల కళాశాలల్లో 2,807 సీట్లు ఉండగా..1,325 భర్తీ అయ్యాయి. డిగ్రీలో మొత్తం 22 కోర్సులు ఉండగా 3 కోర్సుల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. అత్యధికంగా బిఎస్సీలో 62,429 మంది అడ్మిషన్లు పొందారు. బికాంలో 51,395 మంది, బిఎలో 11,914 మంది, బిబిఎలో 5,585 మంది అడ్మిషన్లు పొందారు.