Nov 18,2020 19:17

న్యూఢిల్లీ : ఎవరైనా సరే పండుగలకో, ప్రత్యేకించి ఏదైనా స్పెషల్‌ రోజులకో స్నేహితులకి, బంధువులకి బహుమతులనందిస్తారు. అయితే ఏకంగా బహుమతినందించడానికే దొంగతనం చేయడం.. ఆ నిందితుడు పోలీసులకు పట్టుబడటం చూస్తే సినిమాల్లోని సన్నివేశాలను తలిపిస్తోంది కదూ..! సరిగ్గా నిజజీవితంలో ఇటువంటి సంఘటనే ఢిల్లీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఢిల్లీలో సేవా నగర్‌లో బైక్‌ దొంగిలించబడిందని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆ మేరకు దర్యాప్తు చేపట్టగా.. సీసీటీవీ ఫుటేజీలో ఫిర్యాదు చేసిన మోటార్‌సైకిల్‌ దగ్గర ఓ వ్యక్తి దాగి ఉన్నట్లు కనిపించింది. కొంత సమయం తరువాత బైక్‌ను దొంగిలించారని సీనియర్‌ పోలీసు అధికారి అన్నారు. కాగా, దొంగిలించబడిన బైకే ఢిల్లీలోని సేవా నగర్‌ నాలా సమీపంలో విక్రయించబడుతుందని పోలీసులకు సమాచారం అందింది. ఆ తర్వాత పోలీసులు చాకచక్యంగా నిందితుడిని పట్టుకొని అరెస్టు చేసినట్లు డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ అతుల్‌ కుమార్‌ ఠాకూర్‌ తెలిపారు. పోలీసులు అరెస్టు చేసిన నిందితుడిని విచారించగా.. ఆయన బీహార్‌లోని సీతామర్హి జిల్లా నివాసి అయిన శివశంకర్‌ అనే 25 ఏళ్ల యువకుడు. ప్రత్యేకించి దొంగతనం ఎందుకు చేశారంటే బంధువులకు దీపావళి పండుగ కానుకగా ఇద్దామని మోటార్‌సైకిల్‌ను దొంగిలించారట. ఆయన ఢిల్లీలో కోట్ల ముబారక్‌పూర్‌లోని ఒక దాబాలో పనిచేశారని పోలీసులు అన్నారు. అయితే ఫన్నీగా అనిపించే విషయమేమిటంటే.. నిందితుడు దొంగిలించిన బైక్‌ను ఎలాగైనా బంధువులకు అందజేయాలని పోలీసులనే కోరారట..!