Dec 02,2021 02:48

ఆన్‌లైన్‌ కోర్సులను ప్రారంభించి ప్రసంగిస్తున్న వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి

ప్రజాశక్తి- విశాఖపట్నం
డిజిటల్‌ విధానాలతో ఎక్కువ మందికి చేరువ కావడం సాధ్యపడుతోందని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం ఏయూ అకడమిక్‌ సెనేట్‌ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏయూ దూరవిద్య కేంద్రం నుంచి నూతనంగా నిర్వహిస్తున్న బికాం, ఎంఏ(సోషియాలజీ) ఆన్‌లైన్‌ కోర్సులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆన్‌లైన్‌ కోర్సుల ఫలితంగా గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో(జిఈఆర్‌) పెరుగుతుందన్నారు. ఇది ఎంతో సాహసోపేతమైన నిర్ణయమన్నారు. పరిమిత వనరులతో అపరిమిత సంఖ్యలో ప్రపంచ వ్యాప్తంగా విద్యార్థులకు ఏయూ నేడు చేరువవుతుందన్నారు.2025 నాటికి రాష్ట్రంలో జిఈఆర్‌ 50 శాతానికి పెంచడం ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించుకుని, ఈదిశగా విద్యా రంగంలో సంస్కరణలు చేపడుతూ, పూర్తి భారాన్ని ప్రభుత్వం భరిస్తోందన్నారు.
ఉపాధి, ఎంటర్‌ప్యూనర్‌ రంగాలలో ఉన్నవారికి ఇటువంటి ఆన్‌లైన్‌ విద్య ఎంతో సౌలభ్యంగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో టేలెంట్‌ ఎడ్జ్‌ సిఈఓ, ఎండి నీలేష్‌ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలో వీటిని తాము నిర్వహిస్తున్నామన్నారు. ఏయూ సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. కంప్యూటర్‌ సెంటర్‌ సంచాలకులు ఆచార్య కె.రమాసుధ మాట్లాడుతూ బోధన, పరీక్షలు, క్విజ్‌, ఆన్‌లైన్‌ ఇంటరాక్షన్‌ వంటివి ఉంటాయన్నారు. ఏపీలో తొలిసారిగా ఏయూ దీనికి శ్రీకారం చుట్టిందన్నారు.
కార్యక్రమంలో రెక్టార్‌ ఆచార్య కె.సమత, ఇంచార్జి రిజిస్ట్రార్‌ ఆచార్య జి.వి.ఆర్‌ బాబు, దూరవిద్య సంచాలకులు ఆచార్య కె.విశ్వేస్వర రావు తదితరులు ప్రంసగించారు.