Jun 09,2021 21:43

పారిస్‌ : ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో పెను సంచలనం నమోదైంది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్‌ పోటీలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌, పోలెండ్‌కు చెందిన 8వ ర్యాంకర్‌ ఇగా స్వైటెక్‌ 4-6, 4-6 తేడాతో గ్రీక్‌కు చెందిన 17వ సీడ్‌ మరియ సక్కారి చేతిలో వరుససెట్లలో ఓడింది. సక్కారి ఓ గ్రాండ్‌స్లామ్‌ సెమీస్‌కు చేరడం ఇది రెండోసారి మాత్రమే. గత ఏడాదీ ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో సెమీస్‌కు చేరి పరాజయంపాలైంది. మరో క్వార్టర్‌ఫైనల్‌ పోటీలో అమెరికా యువ సంచలనం కోకా గాఫ్‌ విజయాలకు బ్రేక్‌ పడింది. చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన అన్‌సీడెడ్‌ క్రేజికోవా 7-6(8-6), 6-3తో 24వ సీడ్‌ కోకా గాఫ్‌ను చిత్తుచేసి సెమీఫైనల్లోకి దూసుకెళ్ళింది.

క్రేజికోవా
క్రేజికోవా


2వ సీడ్‌ మెద్వదెవ్‌ ఓటమి
పురుషుల సింగిల్స్‌లో టైటిల్‌ ఫేవరేట్‌, 2వ సీడ్‌ రష్యాకు చెందిన మెద్వదెవ్‌ పరాజయాన్ని చవిచూశాడు. క్వార్టర్‌ఫైనల్లో మెద్వదెవ్‌ 3-6, 6-7(3-7), 5-7)తో 5వ సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీక్‌) చేతిలో ఓడాడు. తొలి సెట్‌ను సునాయాసంగా గెల్చిన సిట్సిపాస్‌.. రెండోసెట్‌ను టైబ్రేక్‌లో గెల్చుకున్నాడు. మూడో సెట్‌లోనూ చివరివరకూ పోరాడి 7-5తో ఆ సెట్‌ను చేజిక్కించుకొని మ్యాచ్‌ను ముగించాడు. మంగళవారం రాత్రి జరిగిన క్వార్టర్‌ఫైనల్‌ పోటీలో 6వ సీడ్‌ జ్వెరేవ్‌(జర్మనీ) 6-4, 6-1, 6-1తో డావిడోవిచ్‌(స్పెయిన్‌)ను ఓడించి సెమీస్‌కు చేరాడు. శుక్రవారం జరిగే తొలి సెమీఫైనల్‌ జ్వెరేవ్‌ాసిట్సిపాస్‌ల మధ్య జరగనుంది.