Jan 13,2021 06:43

డైరెక్ట్‌ టు హోం (డిటిహెచ్‌) రంగంలో వంద శాతం విదేశీ పెట్టుబడులకు డిసెంబరు 23వ తేదీన కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దానితో పాటు లైసెన్స్‌ కాలాన్ని 10 నుండి 20 సంవత్సరాలకు పెంచి, ఫీజును కూడా తగ్గించింది. ఈ రంగంలో నూరు శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతివ్వటం దేశ ప్రయోజనాలకు, దేశభద్రతకు తీవ్ర ప్రమాదం కలిగిస్తుంది.
 

దేశంలో డిటిహెచ్‌ సర్వీసులు
దేశంలో డిటిహెచ్‌ సర్వీసులకు 2000 సంవత్సరంలో అనుమతించారు. డిటిహెచ్‌ సంస్థలలో విదేశీ పెట్టుబడులను 49 శాతానికి పరిమితం చేశారు. కంపెనీ నిర్వాహకుడు భారత పౌరుడై ఉండాలని పేర్కొన్నారు. 2003, అక్టోబరు 2వ తేదీన దేశంలో మొదటి డిటిహెచ్‌ సంస్థను జీ టివి ఏర్పాటు చేసింది. ప్రారంభించిన రెండు సంవత్సరాలలోనే 3.5 లక్షల మందికి తన ప్రసారాలను అందజేసింది. 2004 డిసెంబరులో డిడి డైరెక్ట్‌ ప్లస్‌ను (ఇపుడు డిడి ఫ్రీ డిష్‌) ప్రసారభారతి ప్రారంభించింది. ఉచితంగా ప్రసారాలను అందించే ఈ సంస్థ ఫ్రీ ఎయిర్‌ ఛానళ్లకు మాత్రమే ప్రసారాలను అందిస్తుంది. 2004లో టాటా సంస్థ 'స్టార్‌ ఇండియా'తో కలిసి జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. 2006 ఆగస్టులో టాటా స్కై డిటిహెచ్‌ ప్రసారాలను ప్రారంభించింది.

తెర మీది దృశ్యం స్పష్టంగా కనబడేలా, శబ్దం వినపడేలా చేయటం, ఎక్కువ ఛానళ్లను ఇవ్వటం ద్వారా మెట్రో నగరాలు, పెద్ద పట్టణాలలోని వినియోగదారులపై కేంద్రీకరించి, కేబుల్‌ వినియోగం నుండి వారిని తనవైపుకు తెచ్చుకోవటానికి టాటా స్కై కేంద్రీకరణ చేసింది. 2007లో జీ ఛానల్‌, స్టార్‌ మధ్య వివాదం పరిష్కారం అయిన తర్వాత రెండు సంస్థలు రాజీ పడి ఒకరి నెట్‌వర్క్‌ ద్వారా మరొకరి ప్రసారాలను ఇవ్వాలని అంగీకారానికి వచ్చారు. ఈ నిర్ణయం, డిష్‌ టివి ఎక్కువ ట్రాన్స్‌పాండర్లను సంపాదించుకోవటం వలన అప్పటికి దేశంలో ఏ ఛానల్‌ ఇవ్వలేని విధంగా 150 ఛానళ్లను ఇవ్వగలిగారు. సన్‌ డైరెక్ట్‌, ఎయిర్‌టెల్‌లు 2007, 2008 లలో తమ సర్వీసులను ప్రారంభించాయిు. రిలయన్స్‌ బిగ్‌ టివి 2008 ఆగస్టులో ప్రారంభమైంది. 2009లో వీడియోకాన్‌ తన సేవలను ప్రారంభించింది. భారతదేశంలో 2005లో 15 లక్షల మందిగా ఉన్న డిటిహెచ్‌ వినియోగదారులు 2020 మార్చి నాటికి ఏడు కోట్లకు పెరిగారు.
 

ట్రాయ్‌ నిబంధనలు
భారతదేశంలో టివి వినియోగదారులపై ప్యాకేజ్‌ ఒప్పందాలను రుద్దవద్దని, తాము కోరుకున్న ఛానళ్ళను వారికి ఇవ్వాలని, 2011 జనవరి లోగా దీనిని అమలు చేయాలని ట్రాయ్‌ (టెలికాం రెగ్యులేటరి అధారిటి ఆఫ్‌ ఇండియా) గడువు నిర్దేశించింది. ప్రతి సంస్థా అన్ని పే ఛానళ్లను తమ వినియోగదారులకు అందజేయాలని, ప్రతి పే ఛానల్‌ గరిష్ట ధరను తమ వినియోగదారులకు తెలియజేయాలని ట్రారు తన ఆదేశాలలో పేర్కొంది. టాటా స్కై, ఎయిర్‌టెల్‌ డిజిటల్‌ టివి, వీడియోకాన్‌ డి2హెచ్‌, రిలయన్స్‌ డిజిటల్‌ టివిలు 2011 జనవరి నుండి దీనిని అమలుచేస్తున్నాయి. డిటిహెచ్‌ సర్వీసులు ప్రారంభమైన తర్వాత సెట్‌ టాప్‌బాక్స్‌ల ధరలు తగ్గాయి. 2003లో 4,000 రూపాయలున్న సెట్‌ టాప్‌బాక్స్‌ ధర ఇపుడు 300 రూపాయలకు తగ్గింది.

టివి రంగంలో డిటిహెచ్‌ రావటం పట్టణ ప్రాంతాలలో మార్పు తీసుకొచ్చింది. రకరకాల ఆఫర్లు ప్రకటించటం ద్వారా వారు వినియోగదారులను ఆకర్షించారు. ఈ సంస్థలు చట్టాలకు కట్టుబడకుండా అనేక విధాలైన అక్రమాలకూ పాల్పడ్డాయి. ఈ అక్రమాలకు సంబంధించి కోర్టులలో కేసులు కూడా దాఖలు చేశారు. ఈ సంస్థలు ట్రారు నిబంధనలను ఉల్లంఘిస్తూ, వినియోగదారులను దోపిడీ చేస్తున్నాయి. ప్రజల సంపద అయిన వాయు తరంగాలను తమ ఇష్టం వచ్చినట్లుగా వినియోగించుకొంటున్నాయి. డిటిహెచ్‌ సంస్థలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయని ప్రభుత్వం అంగీకరించినప్పటికీ వాటిపైన ఎటువంటి చర్యలూ తీసుకోలేదు.

కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ వద్ద రిజిష్టర్‌ చేసుకోని ఏ ఛానెల్‌ కార్యక్రమాలను డిటిహెచ్‌ సంస్థలు ప్రసారం చేయకూడదని చట్టంలో పేర్కొన్నారు. దానిని ఉల్లంఘిస్తూ నమోదు చేసుకోని ఛానళ్ళ కార్యక్రమాలను కూడా ప్రసారం చేస్తున్నాయి. తమ స్వంత ఛానళ్ళను కూడా రిజిస్టర్‌ చేయకుండా ప్రసారం చేస్తున్నాయి. కొన్ని డిటిహెచ్‌లు పూర్తిగా వాణిజ్య ప్రకటనలను ప్రసారం చేస్తున్నాయి. టివి ఆన్‌చేయగానే యాడ్లను ప్రసారం చేస్తూ, కొన్ని సెకన్ల పాటు రిమోట్లు పనిచేయకుండా కొన్ని ఛానళ్ళు చేస్తున్నాయి. డిమాండ్‌పై సినిమాలు ప్రసారం చేయటం, ఆటలు, ఇతర పజిళ్లు, ఎలక్ట్రానిక్‌ గేమింగ్‌ పజిల్‌ తదితరాలను ప్రసారం చేయటానికి ప్రత్యేకమైన లైసెన్స్‌ తీసుకోవాలి. కాని ఏ ఛానల్‌ ఈ నిబంధనలను పాటించటం లేదు. నిబంధనలు రూపొందించిన ట్రారు వాటిని అమలుజరపటంలో దారుణంగా విఫలమైంది.

ప్రైవేటీకరణ కోసం ప్రచారం
ఈ విధమైన అక్రమాలకు పాల్పడుతున్న ప్రైవేటుసంస్థలు డిటిహెచ్‌ రంగం లోకి ప్రవేశించిన తర్వాత తమ ప్రయోజనాలను ముందుకు తీసుకుపోవటానికి ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. ప్రభుత్వ రంగం అనవసరమని, ప్రైవేటు రంగం సమర్ధవంతంగా పని చేసి, దేశాన్ని త్వరగా అభివృద్ధి చేస్తుందనే ప్రచారాన్ని తీవ్రం చేశారు. డిటిహెచ్‌తో పాటు పత్రికలు కూడా కేంద్రీకృతం కావటం ప్రారంభమైంది. దానితో మీడియాతో పాటు పత్రికలను కూడా వినియోగించుకొని ప్రభుత్వ రంగానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం ఫలితంగా ప్రజలలో కూడా ప్రభుత రంగంపై సానుకూలత తగ్గి, ప్రైవేటు రంగం నిజంగానే సమర్ధవంతమైనదని భావించటం ప్రారంభించారు. ప్రైవేటు సంస్థలకు మద్దతునిస్తున్న ప్రభుత్వాలు కూడా పెట్టుబడిదారులు చేస్తున్న ప్రచారాన్ని భుజాన వేసుకున్నాయి. సరళీకరణ విధానాలలో భాగంగా ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి తదితరాలు కూడా ప్రైవేటీకరణను గురించి ఒత్తిడి చేయటం పెరిగింది. ఈ విధంగా మీడియాపై ఆధిపత్యం వహించిన ప్రైవేటు సంస్థలు అన్ని నిబంధనలను తుంగలో తొక్కి ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా తమ స్వ ప్రయోజనాల కోసం ప్రచారం చేసుకుంటున్నాయి. ప్రైవేటు సంస్థలు ఎప్పుడు, ఎక్కడ తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నా తమ స్వప్రయోజనాలే లక్ష్యంగా పని చేస్తాయి.
 

విదేశీ పెట్టుబడులతో ప్రమాదం
డిటిహెచ్‌ రంగం లోకి 100 శాతం విదేశీ పెట్టుబడులు వస్తే ఏం జరుగుతుంది? తమ దేశాల, సామ్రాజ్యవాదుల ప్రయోజనాలనే మన దేశ, మన ప్రజల ప్రయోజనాలుగా ప్రచారం చేస్తారు. తమ దేశాలలోని ద్రవ్య పెట్టుబడులు, యుద్ధ పరిశ్రమల ప్రయోజనాలనే ముందుకు తెస్తారు. యుద్ధోన్మాదాన్ని రెచ్చగొడతారు. ప్రస్తుతం అమెరికన్‌ సామ్రాజ్యవాదానికి చైనా వ్యతిరేక సమీకరణలో తోడయ్యేవారు కావాలి. మరోవైపున పాకిస్థాన్‌ పట్ల కూడా ఇదేవిధంగా వ్యతిరేకతను పెంచుతున్నారు. దీనితోబాటు...మనకు సహాయం చేసే పేరుతో మన దేశాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవటానికి, తమ ఆయుధ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న ఆయుధాలను మన చేత కొనిపించేందుకు అమెరికా వేస్తున్న ఉచ్చులో మన దేశం పడుతున్నది.
 

మన సంస్కృతి మీద దాడి

సామ్రాజ్యవాద ప్రసార మాధ్యమాలు మనదేశంలోకి ప్రవేశించిన తర్వాత మన సంస్కృతిని దెబ్బ తీయటానికి ప్రయత్నిస్తాయి. యువతను బాధ్యతారహితంగా వ్యవహరించేలా చేయటానికి, విశృంఖలంగా వ్యవహరించటమే యువకత్వానికి అసలైన అర్ధంగా చిత్రీకరిస్తారు. అమ్మాయిలను ఏడ్పించడం యువకుల లక్షణమనే ప్రచారం చూడా జరుగుతున్నది. అటువంటి విష సంస్కృతిని వ్యాపిస్తున్న ఫలితంగా బాలికల నుండి వృద్ధుల వరకు మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెరుగుతున్నాయి. అందువలన డిటిహెచ్‌లో 100 విదేశీ పెట్టుబడులు దేశభద్రతకు ప్రమాదం కలిగిస్తాయి. చుట్టుపట్ల దేశాలతో శత్రుత్వాన్ని పెంచుతాయి. మన ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. దేశంలోని నియంత్రణా సంస్థలను లెక్కచేయరు. కాబట్టి డిటిహెచ్‌ లో 100 శాతం విదేశీ పెట్టుబడికి అనుమతి మనకు అన్నివిధాలుగా నష్టం కలిగిస్తుంది.
                                                                                              * ఎ. కోటిరెడ్డి