
- తాడేపల్లిలోని డివిఎస్ హాల్ ప్రారంభోత్సవ సభలో బివి రాఘవులు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రజా ఉద్యమ నిర్మాణంలో పత్రిక అత్యంతావశ్యకమని గుర్తించి, ఎన్ని నిర్బంధాలెదురైనా లెక్కచేయకుండా అకుంఠిత దీక్షతో ముందుకెళ్లిన కమ్యూనిస్టు డి వి సుబ్బారావు జీవితం నేటి తరానికి ఆదర్శ ప్రాయం, అనుసరణీయమని సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు పేర్కొన్నారు. నాటి ప్రజాశక్తి, విశాలాంధ్ర, జనశక్తి పత్రికల అభివృద్ధిలో డివిఎస్ ముఖ్యమైన పాత్ర పోషించారని ఆయన చెప్పారు. తాడేపల్లిలోని ప్రజాశక్తి భవన్లో కామ్రేడ్ డివిఎస్ హాల్‌ను బివి రాఘవులు మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ సభ్యులు పి మధు, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నర్సింగరావు, ప్రజాశక్తి సంపాదకులు ఎంవిఎస్ శర్మ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు, డివిఎస్ కుటుంబ సభ్యులు డి భానుప్రసాద్, సుమిత్ర, రమణ తదితరులు డివిఎస్ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రజాశక్తి సంపాదకులు ఎంవిఎస్ శర్మ అధ్యక్షతన జరిగిన సభలో బివి రాఘవులు మాట్లాడారు. ప్రజా ఉద్యమ వ్యాప్తిని, సిద్ధాంత భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు పత్రికలే క్రియాశీలకమని అన్నారు. స్వాతంత్య్ర ఆకాంక్షను ప్రజల్లో రగిలిస్తోందని బ్రిటీష్ ప్రభుత్వం ప్రింటింగ్ మిషన్లను జప్తు చేస్తే సొంత ఆస్తులను అమ్మి మళ్లీ పత్రికను పునరుద్ధరించేందుకు డివిఎస్ కృషి చేశారని అన్నారు. ప్రతి పత్రికకూ ఒక లక్ష్యం ఉంటుందని తెలిపారు. పెట్టుబడిదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు కొన్ని పత్రికలు పనిచేస్తే దోపిడీకి వ్యతిరేకంగా సమసమాజ స్థాపనే లక్ష్యంగా వామపక్ష పత్రికలు ఉంటాయన్నారు. డివిఎస్ ఆశయాల కోసం ప్రజాశక్తి సిబ్బంది పనిచేయాలని కోరారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ జాతీయోద్యమ కాలంలోనే కాక స్వాతంత్య్రానంతరం కూడా కమ్యూనిస్టు పత్రికలు నిర్బంధాలకు గురయ్యాయన్నారు. పత్రిక ఆవశ్యకత కమ్యూనిస్టు పార్టీకి తప్పనిసరి అని అన్నారు. నిర్వహణ చాలా కష్టమైనా డివిఎస్ విశాలాంధ్ర, జనశక్తి, ప్రజాశక్తి పత్రికల నిర్వహణలో క్రియాశీలకంగా వ్యవహరించారని పేర్కొన్నారు. ప్రజాశక్తిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు డివిఎస్‌ను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు పి మధు మాట్లాడుతూ డివిఎస్ భూస్వామ్య కుటుంబంలో జన్మించినా... సమసమాజం కోసం కమ్యూనిస్టు పార్టీలో పనిచేసేందుకు ముందుకు వచ్చారని అన్నారు. ఇంట్లో తండ్రి వారిస్తున్నా లెక్కచేయకుండా తన జీవితాన్ని ఉద్యమాలకు అంకితం చేశారని తెలిపారు. తీవ్రమైన పోలీస్ నిర్బంధంతో కడలూరు జైలుకు పంపినా లొంగకుండా పనిచేశారని కొనియాడారు. డివిఎస్ సతీమణి భిక్షవతితో పాటు కుటుంబం మొత్తం ఉద్యమాలతోనే జీవనం సాగించారని అన్నారు. డివిఎస్ ఆదర్శప్రాయుడని, ప్రతిఒక్కరూ ఆయన ఆశయసాధన కోసం కృషి చేయాలని కోరారు.