Jan 12,2022 12:12

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణిపై నటుడు సిద్ధార్థ్‌ చేసిన వ్యాఖలు తీవ్ర దుమారం రేపడంతో నేడు సిద్ధార్థ్‌.. సైనాకు క్షమాపణలు తెలిపారు. తాను చేసిన వ్యాఖ్యలు ఆమెను బాధించాయని.. అందుకే మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నానని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా 'సైనా ఎప్పటికీ మన ఛాంపియనే' అని ఆమెను ట్వీట్‌లో కొనియాడారు.
'డియర్‌ సైనా.. కొన్ని రోజుల క్రితం మీ ట్వీట్‌కు నేను మర్యాద మరిచి రీ ట్వీట్‌ చేశాను. దానికి నేను క్షమాపణలు చెప్పాలనుకుంటున్నా. చాలా విషయాల్లో మిమ్మల్ని నేను విభేదించొచ్చు. కానీ నేను మీ ట్వీట్‌ చదివినప్పుడు నిరాశ, కోపంతో చేసిన ఆ కామెంట్లు సమర్థనీయం కావు. మనం చేసిన జోక్‌కి మళ్లీ వివరణ ఇవ్వాల్సి వస్తే.. అది నిజంగా మంచి జోక్‌ కాదు. అలాంటి జోక్‌కు నేను క్షమాపణలు చెబుతున్నా. నా పదజాలం, హాస్యంతో ఎవరినీ అగౌరవపరచాలన్న ఉద్దేశం నాకు లేదు. మహిళగా మిమ్మల్ని కించపరచాలన్న ఉద్దేశం నాకు లేదు. నా క్షపమాణ లేఖను అంగీకరిస్తారని ఆశిస్తున్నా. మీరు ఎప్పటికీ మా ఛాంపియనే' అని సిద్ధార్థ్‌ లేఖలో రాసుకొచ్చారు.
పంజాబ్‌ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ కాన్వారును సుమారు అరగంటసేపు బటిండా ఫ్లైవోవర్‌పై ఆందోళనకారులు అడ్డుకోవడంతో.. ప్రధాని భద్రతా సమస్యపై యావత్‌ దేశమంతా చర్చ నడుస్తోంది. ఇందులో భాగంగా సైనా నెహ్వాల్‌ 'ప్రధానికే భద్రతా సమస్య తలత్తెడం.. అంతర్జాతీయంగా మన దేశ ప్రతిష్ట దిగజార్చినట్లేనని.. ఈ చర్యను తాను ఖండిస్తున్నానని' ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌కు సిద్ధార్థ్‌ 'చిన్న కాక్‌తో ఆడే ప్రపంచ ఛాంపియన్‌... భగవంతుడి దయవల్ల భారతదేశాన్ని కాపాడేవారు ఉన్నారు' అని రీట్వీట్‌ చేశారు. సిద్ధార్థ్‌ వ్యాఖ్యలు మహిళను కించపరిచేవిధంగా ఉన్నాయని.. తక్షణమే తన ట్విటర్‌ ఖాతాను తొలగించాలని, అతనిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి విచారణ జరిపించాలని జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్మన్‌ రేఖాశర్మ మహారాష్ట్ర డిజిపిని కోరారు.
మరోవైపు సిద్ధార్థ్‌ ట్వీట్‌పై సైనా స్పందిస్తూ.. 'ఆయన చేసిన వ్యాఖ్యలకు అర్థం ఏంటో నాకు తెలియదు. నేను వ్యక్తిగతంగా నటుడిగా ఎంతో అభిమానిస్తా. కానీ అతను తన అభిప్రాయాన్ని ఇంకా మంచి పదాలతో వెల్లడించొచ్చు' అని ట్వీట్‌లో పేర్కొన్నారు. సైనా ట్వీట్‌కు సిద్ధార్థ్‌ తాను మహిళల్ని అవమానపరిచేవిధంగా వ్యాఖ్యానించలేదని వివరణ ఇచ్చారు.