
ప్రజాశక్తి- అనకావల్లి
దక్షిణ భారత కరాటే ఛాంపియన్ షిప్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు పతకాలు సాధించింది. 12 మంది గల ఆంధ్ర జట్టులో ఏడుగురు అనకాపల్లి పట్టణానికి చెందినవారు కావడం విశేషం. ఈ నెల 9, 10 తేదీల్లో కేరళ రాష్ట్రం తిరువనంతపురంలోని వెల్లాయంబళం జిమ్మీ జార్జ్ స్పోర్ట్స్ హబ్‌లో జరిగిన 2వ సౌత్ ఇండియా కరాటే ఛాంపియన్ షిప్ పోటీల్లో అనకాపల్లికి చెందిన కరాటే కోచ్ కాకర శివ సారధ్యలో మన రాష్ట్ర జట్టు తరపున ఏడుగురు విద్యార్థులు పాల్గొన్నారు. వారు ఒక బంగారు, ఆరు కాంస్య పతకాలు సాధించారు. వీరంతా గత నెలలో జరిగిన రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో పాల్గొని ఆంధ్ర జట్టుకు ఎంపికయ్యారు. దక్షిణ భారత కరాటే ఛాంపియన్ షిప్లో పాల్గొన్న తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన జట్లతో తలపడి మన జట్టు మంచి ప్రతిభ చూపించారు. వి.ఇంద్రకుమార్ బంగారు పతకం, ఎన్. దివ్యశ్రీ, కె. రేవతి, వై.మోహన్ శ్రీను, పి.నిఖిల్, ఎ. సిరివర్షిణి, వి.భవాని కాంస్య కంచు పతకాలు సాధించారు. ఈ సందర్భంగా ఇక్కడ ఏర్పాటైన అభినందన కార్యక్రమంలో అనకాపల్లి వైసీపీ పార్లమెంటరీ పరిశీలకులు దాడి రత్నాకర్ వారిని అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు మంచి క్రీడాకారులుగా ఎదిగేందుకు రోజూ సాధన చేయాలని సూచించారు.