Jun 10,2021 10:58

సియోల్‌ : దక్షిణ కొరియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఐదొంతస్తుల భవనాన్ని పగలగొడుతుండగా.. ఒక్కసారిగా అక్కడే ఆగి ఉన్న బస్సుపౖౖె పడిపోవడంతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయని స్థానిక ఫైర్‌ స్టేషన్‌ అధికారులు తెలిపారు. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం సియోల్‌కు నైరుతి దిశగా 270 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్వాంజులో చోటుచేసుకుంది. భవనం ప్రక్క సందులో ఉన్న బస్సుపై పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఆ బస్సులో సుమారు 17 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. భవనం కూలడానికి ముందే సిబ్బంది కూడా అక్కడి నుండి వచ్చేశారు. మౌలిక సదుపాయాల భద్రతను మెరుగుపర్చేందుకు పాత భవనాలను కొరియా ప్రభుత్వం ధ్వంసం చేస్తోంది. ఇలా ఓ భవనాన్ని కూల్చి వేస్తుండగానే ఈ ప్రమాదం జరిగింది.