May 28,2023 22:21

పర్యటిస్తున్న కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌

- కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌
ప్రజాశక్తి - ఆమదాలవలస: 
దళితుల సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తున్నాయని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌ విమర్శించారు. మున్సిపాల్టీ పరిధిలోని గాంధీనగర్‌ ఎస్‌సి కాలనీలో డిసిసి అధ్యక్షులు బొడ్డేపల్లి సత్యవతితో కలిసి ఆదివారం ఆయన పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్‌ పార్టీ హయాంలో దళితుల అభ్యున్నతికి, వారి జీవన స్థితిగతుల మెరుగుకు పలు పథకాలను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వాలు దళితుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఎస్‌సి సబ్‌ప్లాన్‌ నిధులను వైసిపి ప్రభుత్వం నవరత్నాల పథకాల కోసం మళ్లించి దళితుల అభివృద్ధికి అడ్డుకట్ట వేసిందన్నారు. వైసిపి ప్రభుత్వం వచ్చాక దళితులపై దాడులూ పెరిగాయన్నారు. దళితుల పక్షపాతి అని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఈ నాలుగేళ్ల కాలంలో వారి అభివృద్ధికి ఏం చేసిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వానికి నిజంగా దళితుల అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే సబ్‌ప్లాన్‌ను పటిష్టంగా అమలు చేసేదని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా దళితుల స్థితిగతులపై అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే జిల్లాకు వచ్చానన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ శ్రీకాకుళం పట్టణాధ్యక్షులు గోవింద మల్లిబాబు, యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు రెల్ల సురేష్‌, ఎస్‌సి సెల్‌ రాష్ట్ర సమన్వయకర్త బొత్స రమణ, జిల్లా ప్రధాన కార్యదర్శి లఖినేని నారాయణరావు, జిల్లా ఆర్గనైజేషన్‌ సెక్రటరీ బస్వా షణ్ముఖరావు తదితరులు పాల్గొన్నారు.