
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో దళితుల సమస్యలు పరిష్కరించాలని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ వద్ద వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆ గ్రామ దళితులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ దత్తిలో దళిత పేటకు ఆనుకొని ఉన్న కాడపు చెరువు వలన ముంపు ప్రమాదాన్ని చాలా కాలంగా భరించాల్సి వస్తుందని, చిన్నపాటి వర్షం వచ్చినా దళితపేటలోకి నీరు ప్రవేశించి అస్తవ్యస్థగా మారుతోందని అన్నారు. గతంలో ఎంపిడిఒ దృష్టికి తీసుకెళ్తే ఇరిగేషన్ అధికారులు వచ్చి తాత్కాలిక పనులు చేపట్టి వదిలేశారని అన్నారు. అంతేకాకుండా శ్మశాన స్థలానికి శవాన్ని తీసుకువెళ్లి ఖననం చేయడానికి నరకయాతన పడుతున్నా రన్నారు. స్మశాన స్థలాన్ని పెంచి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన దళితులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. గ్రామంలో ప్రభుత్వ స్థలాన్ని దళితులకు కేటాయించి పట్టాలివ్వకుండా అన్యాయం చేస్తున్నారనితెలిపారు. దళితపేటకి రహదారి సౌకర్యం కల్పించాలన్నారు. దళితుల పట్ల అధికారులు, పాలకులు నిరక్ష్యం వహిస్తున్నా రన్నారు. అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే పెద్దఎత్తున ఆందోళన చేస్తామని తెలిపారు. అనంతరం ఎస్‌డిసి సుదర్శన దొరకు వినతి అందజేశారు. కార్యక్రమంలో సుందరరావు, గురువులు, దేవి, గౌర్నాయుడు, వారమ్మ తదితరులు పాల్గొన్నారు.