
ప్రజాశక్తి-సత్తెనపల్లి : మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం నుండి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం, దాడులకు వ్యతిరేకంగా దళితులు ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) పల్నాడు జిల్లా అధ్యక్షులు జి.రవిబాబు అన్నారు. సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద గల పుతుంబాక భవన్ వద్ద కెవిపిఎస్ జెండాను సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి చింతపల్లి నాగమల్లేశ్వరరావు ఆవిష్కరించారు. రవిబాబు మాట్లాడుతూ మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మనుధర్మ శాస్త్ర భావజాలాన్ని ప్రచారం చేస్తున్నారని, సమాజంలో మతోన్మాదాన్ని, మూఢవిశ్వాసాలు పెంచే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. దళితులు, గిరిజనులు, ఇతర బలహీన వర్గాల, పేదలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తూ రిజర్వేషన్ అమలుకు వీలులేని పరిస్థితులు తెస్తున్నారని, ఈ చర్యలకు ప్రజల్లో వ్యక్తమయ్యే వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు కుల, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. దళితులు అన్ని రంగాల ప్రజలతో కలిసి ఈ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో దళితులకు శాశ్వత ప్రయోజనం కల్పించే భూమి కొనుగోలు పథకాన్ని ప్రారంభించాలన్నారు. అమరావతి మండలం అత్తలూరు సర్పంచ్, దళిత మహిళ అయిన బంకా సరోజనిపై అజమాయిషీ చేస్తున్న పెత్తందార్ల ఆగడాలు అరికట్టకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.లకీëశ్వరరెడ్డి మాట్లాడుతూ దేశంలో 60 శాతం మంది ప్రజలు ఆధారపడిన వ్యవసాయ రంగాన్ని నాశనం చేయటానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోందని, వ్యవసాయ రంగంలో కూలీలుగా, కౌలురైతులుగా దళితులే ఉన్నారని, వ్యవసాయం నాశనం అయితే దళితులకు తీవ్ర నష్టమని చెప్పారు. ఈ నేపథ్యంలో వ్యవసాయాన్ని కాపాడుకోవడానికి పోరాడాలన్నారు. కార్యక్రమంలో కెవిపిఎస్ నాయకులు పీటర్, కె.నాగేశ్వరరావు, టి.పెద్దిరాజు, బి.బాలకోటయ్య, జె.భగత్, ఎం.దేవసహాయం, సీతారామయ్య పాల్గొన్నారు.