Apr 20,2021 21:12

మాట్లాడుతున్న కెవిపిఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎమ్‌డి.ఆనంద్‌ బాబు

- దాడి జరిగి ఆరు రోజులైనా స్పందించరా
- కెవిపిఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనంద్‌ బాబు
ప్రజాశక్తి - డోన్‌: 
డోన్‌ డీఎస్పీ పరిధిలో దళితులపై జరుగుతున్న దాడుల పట్ల స్పందించాలని, కటారుకొండలో దళితునిపై దాడి జరిగి ఆరు రోజులైనా స్పందించరా అని కెవిపిఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎమ్‌డి.ఆనంద్‌ బాబు ప్రశ్నించారు. మంగళవారం పట్టణంలోని అంబేద్కర్‌ విగ్రహం దగ్గర ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏప్రిల్‌ 14న బిఆర్‌.అంబేద్కర్‌ జయంతి రోజున క్రిష్ణగిరి మండలం కటారుకొండలో దళితుడైన మాదవకృష్ణపై దాడి చేశారని తెలిపారు. దాడి జరిగి ఆరు రోజులైనా నిందితులను అరెస్టు చేయకపోగా కనీసం కేసు కూడా నమోదు చేయలేదన్నారు. ఎస్పీ సెన్సిటైజేషన్‌ పేరుతో కార్యక్రమం నిర్వహించి స్టేషన్‌కు వచ్చే వారిని గౌరవించాలని తెలియజేశారని అన్నారు. మాదవకృష్ణపై దాడిచేసిన వారిపై అట్రాసిటి కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. కెవిపిఎస్‌ పట్టణ కార్యదర్శి కె.రాజకుమార్‌, బాధితుడు మాదవ కృష్ణ, కెవిపిఎస్‌ నాయకులు మునెమ్మ, రామచంద్ర, చిరంజీవి, మనోహర్‌ పాల్గొన్నారు.
మంత్రి బుగ్గనకు వినతి : పట్టణంలో దళితులపై దాడి చేసి అడ్డగించి చంపుతానని బెదిరించిన రెండు నెలల తర్వాత కేసు పెట్టారని, అట్రాసిటీ కేసు పెట్టి మూడు నెలలైనా ఇప్పటికీ అరెస్టు చేయలేదని, మీరైనా స్పందించి అరెస్టు చేయించాలని ఆనంద్‌ బాబు కోరారు. పట్టణంలోని వైసిపి కార్యాలయంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ను కలిసి కెవిపిఎస్‌ ప్రతినిధి బృందం వినతిపత్రం ఇచ్చింది. ఈ సందర్భంగా ఆనంద్‌ బాబు మాట్లాడారు. 2020 నవంబర్‌లో దళితులను అడ్డగించి చంపుతామని బెదిరిస్తే 2021 జనవరిలో కేసును నమోదు చేశారని తెలిపారు. అట్రాసిటీ కేసు నమోదు మూడు నెలలు పూర్తయిన విచారణ కానీ, అరెస్టు కానీ చేయలేదన్నారు. ప్రజాప్రతినిధిగా జోక్యం చేసుకుని, దళితులపై దాడి చేసిన ఉప్పరి శేఖర్‌, బండల ఈశ్వరయ్యను అరెస్టు చేయించి, అరాచకవాదుల నుంచి దళితులకు రక్షణ కల్పించాలని కోరారు. బాధిత కుటుంబ సభ్యులు రాజకుమార్‌, మునెమ్మ, వనిత ఉన్నారు.