Jul 04,2021 09:33

ఆయనో పెద్ద కార్పొరేట్‌.. ఎంత పెద్ద అంటే.. ఏకంగా ఐదు వేల కోట్ల రూపాయలను బ్యాంకులకు ఎగ్గొట్టే అంత. అంత మొత్తంలో మోసం చేస్తే ఏం జరుగుతుంది? ఏం జరగాలో అదే జరిగింది. విదేశాలకు ఎగిరిపోయాడు. ఆయన ఒక్కడే వెళ్లిపోయాడనుకుంటే పొరపాటే.. సకుటుంబ సపరివార సమేతంగా దేశం దాటేశాడు. ఆల్జీరియా, నైజీరియా దేశాలకు చేరుకుని, ఆ దేశాల పౌరునిగా మారిపోయాడు. అక్కడి నుండే వ్యాపార సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడు. ఆ సామ్రాజ్యం నుండి మనదేశం కూడా సరుకులు కొంటోంది. చిత్రం ఏమిటంటే ఈ లావాదేవీలనే న్యాయస్థానాల్లో చూపించి, ''దొంగనైతే సరుకు ఎలా కొంటారు?'' అని దబాయించి మరీ తప్పించుకున్నాడు. ఇప్పుడాయన వేల కోట్ల రూపాయల దేశ ప్రజల కష్టార్జితాన్ని దోచేసిన దొంగా? వేల కోట్ల రూపాయల పెట్టుబడితో దేశాన్ని ఉద్ధరిస్తున్న కార్పొరేట్‌ దొరా? క్రైమ్‌ థ్రిల్లర్‌ను మరిపించే ఈ ఎగవేత కథలో ప్రభుత్వాల పాత్ర ఎంత? అధికారులు ఎలా సహకరించారు? ఇదంతా అసలు ఎలా జరిగింది? వీటి గురించే ఈ కథనం..

దో అంతర్జాతీయ విమానాశ్రయం.
2019వ సంవత్సరం, మార్చి నెలలో
ఒకరోజు సాయంత్ర సమయం.

దొంగే... దొర !


    భారతదేశానికి చెందిన ఒక సంపన్న కుటుంబం తమ సొంత జెట్‌ విమానంలో ఎగిరిపోవడానికి సిద్ధంగా ఉంది. ఏ కోల్‌కతానో, ముంబయి విమానాశ్రయం అనుకుంటే పొరపాటు. కుటుంబం మన దేశానికి చెందినదే కానీ, అది అల్బేనియా రాజధాని తిరానా ఇంటర్‌నేషనల్‌ ఎయిర్‌పోర్టు. ఎగిరిపోవడానికి సిద్ధంగా ఉన్న వారు సందేసరా కుటుంబ సభ్యులు. దేశంలో ప్రారంభమైన ఆర్థిక సంస్కరణలను ఉపయోగించుకుని, శరవేగంగా సంపద పోగేసుకున్న వారిలో సందేసరా కుటుంబం కూడా ఒకటి. 1980వ దశకంలో టీ కంపెనీతో ప్రారంభమైన వీరి వ్యాపార సామ్రాజ్యం 1991 నాటికి స్టెర్లింగ్‌ బయోటెక్‌ వరకు బహుముఖాలుగా విస్తరించింది. ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులు చేతన్‌ కుమార్‌ సందేసరా, ఆయన భార్య దీప్తి సందేసరా, అన్న నితిన్‌ సందేసరాలు సొంత జెట్‌ విమానంలో ఉన్నారు. దీప్తి సోదరుడు హితేష్‌ కుమార్‌ పటేల్‌ను మాత్రం అల్బేనియా పాస్‌పోర్టు లేకపోవడంతో ఎయిర్‌పోర్టు అధికారులు అడ్డుకున్నారు. ఆయన దగ్గర భారత ప్రభుత్వం జారీ చేసిన పాస్‌పోర్టు మాత్రమే ఉంది. నిజానికి ఈ నలుగురి మీద అప్పటకే భారతదేశంలో తీవ్ర ఆర్థికనేరాలకు పాల్పడినందుకు ఇంటర్‌పోల్‌ 'రెడ్‌ నోటీసు' ఉంది. సిబిఐతో పాటు పలు దర్యాప్తు సంస్థలు వారికోసం తీవ్రంగా గాలిస్తున్నాయి. అయితే, మిగిలిన ముగ్గురి వద్ద ఆ దేశ అధ్యక్షుడు లిర్‌మెత ప్రత్యేకంగా బహూకరించిన అల్బేనియా పాస్‌పోర్టులు ఉన్నాయి. దీంతో స్థానిక ఇమ్మిగ్రేషన్‌ అధికారులు వారిని ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. హితేష్‌కుమార్‌ రాడని తేలడంతో సందేసరా కుటుంబం ఎక్కిన ప్రత్యేక జెట్‌ విమానం తిరానా అంతర్జాతీయ విమానం నుండి బయలుదేరింది. నైజీరియా వైపుగా దూసుకుపోయింది. మరి హితేష్‌కుమార్‌ సంగతి..? అల్బేనియా కోర్టులో కొన్ని నెలల పాటు విచారణ జరిగింది. నేరం రుజువు కాలేదని కేసు కొట్టేశారు. ఆయన ఇప్పుడు స్వేచ్ఛాజీవి !

                                                                             ఇదీ ప్రారంభం..!

దొంగే... దొర !

   సందేసరా సోదరులు చేతన్‌కుమార్‌, నితిన్‌ది మధ్యతరగతి కుటుంబం. 1980వ సంవత్సరంలో ఇద్దరు కామర్స్‌లో డిగ్రీ చేశారు. నితిన్‌ ముంబయిలో ఛార్టెడ్‌ అక్కౌంటెంట్‌ దగ్గర పనికి చేరగా. చేతన్‌ ఒక టీ కంపెనీని ప్రారంభించాడు. 1985వ సంవత్సరంలో వీరికి ముంబయికి చెందిన ప్లూటో ఎక్స్‌పోర్ట్సు అండ్‌ కన్సల్టెంట్స్‌ సంస్థతో పరిచయం ఏర్పడింది. చిన్నగా ఆ సంస్థలోకి ప్రవేశించారు. ఎలా ప్రవేశించారు, అప్పట్లో వారి హోదాలు ఏమిటి అన్న ప్రశ్నలకు ప్రస్తుతం సమాధానం దొరకడం లేదు. కానీ నాలుగు సంవత్సరాల్లోనే ఆ సంస్థ వీరి గుప్పిట్లోకి వచ్చేసింది. నితిన్‌ ఛైర్మన్‌ అయ్యాడు. 1991లో 'స్టెర్లింగ్‌' పేరును సొంతం చేసుకున్నారు. అప్పటికే ఉన్న టీ కంపెనీతో కలిపి 'స్టెర్లింగ్‌ టీ అండ్‌ ఇండిస్టీస్‌'ను రిజిస్టర్‌ చేశారు. ఆ తరువాత కొంతకాలానికే 'స్టెర్లింగ్‌ బయోటెక్‌'గా పేరు మార్చారు. ఫార్మా రంగంలోకి అడుగుపెట్టారు. అనేక ఔషధాల్లో ఉపయోగించే 'జిలెటిన్‌' అనే పదార్థాన్ని తయారుచేయడం ప్రారంభించారు. దీంతో వీరి సంపాదన ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. క్రమేణా యంత్రాల తయారీ, ఆయిల్‌, ఆ తరువాత పోర్టుల రంగాల్లోకి తమ వ్యాపారాన్ని విస్తరించారు.

                                                                 వైబ్రంట్‌ గుజరాత్‌తో..

   అప్పటి గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ 2003వ సంవత్సరంలో వైబ్రంట్‌ గుజరాత్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గుజరాత్‌ను శక్తివంతంగా తీర్చిదిద్దడం ఈ కార్యక్రమ లక్ష్యమని మోడీ అప్పట్లో ప్రకటించారు. ఆ లక్ష్యం ఎంత మేరకు నెరవేరిందో కానీ, సందేసరా కుటుంబం మాత్రం భారీగా లబ్ధి పొందింది. అప్పటిదాకా వారు ఊహించడానికి కూడా సాహసించని స్థాయిలో వాణిజ్య కార్యకలాపాలు విస్తరించారు. 2009 నాటికి ఈ కార్యక్రమం ద్వారా 35 వేల కోట్ల రూపాయల ఎంఒయులను గుజరాత్‌ ప్రభుత్వంతో కుదుర్చుకున్నారు. స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌లు, గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టుల నిర్మాణం వంటివి వీటిలో ఉన్నాయి.

                                     

                                                                        షెల్‌ కంపెనీల మాయాజాలం

దొంగే... దొర !

   వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే క్రమంలో వందలాది షెల్‌ కంపెనీలను సందేసరా కుటుంబం ఏర్పాటు చేసింది. ఒక దశలో వీరు 340 కంపెనీలను ఏర్పాటు చేశారు. వీటిలో 92 భారతదేశం బయట ఏర్పాటు చేశారు. వీటిలో 311 కంపెనీలను బినామీ పేర్లతో నిర్వహించేవారని ఆ తరువాత జరిగిన విచారణలో వెల్లడైంది. ఊరూ పేరూ లేని కంపెనీలను ఉపయోగించి, బ్యాంకుల నుండి రుణాలు సేకరించడం, ఆ మొత్తాన్ని విదేశాలకు పంపి అక్కడి నుండి తిరిగి తమ ఖాతాల్లోకి జమ చేసుకోవడం. ఇదీ వీరు చేసిన మనీ లాండరింగ్‌! దీనికోసమే షెల్‌ కంపెనీలను ఏర్పాటు చేశారని.. తమ వద్ద పనిచేసే ఉద్యోగులనే ఆ కంపెనీలకు అధినేతలుగా చూపారన్నది విచారణలో వెల్లడైన అంశాలు. షెల్‌ కంపెనీల బ్యాలెన్స్‌షీట్‌లను భారీగా పెంచి చూపించి, వాటి ఆధారంగా బ్యాంకుల నుండి రుణాలు పొందడం, ఆ తరువాత చేతులెత్తేయడం వీరి వ్యూహం. వీరి బారిన పడి, భారీగా నష్టపోయిన బ్యాంకుల్లో ఆంధ్రాబ్యాంకు ముందువరసలో ఉంది. ఇప్పుడు ఆంధ్రాబ్యాంకు పేరు కూడా కనుమరుగైంది. అది వేరే కథ !

                                                                            ముందే తెలిసిందా..!

దొంగే... దొర !

    ఆర్థిక నేరాలకు సంబంధించి కేసులు నమోదవుతున్న విషయం సందేసరా కుటుంబానికి ముందే తెలిసిందా? వారికి ఉన్న విస్తారమైన పరిచయాలు ఈ రకమైన అనుమానాలనే కలగజేస్తాయి. అత్యంత విలాసవంతమైన జీవితం గడిపే ఆ కుటుంబ సభ్యులకు అత్యున్నత స్థాయి రాజకీయ నేతలతో పరిచయాలు ఉన్నాయి. అధికారంలో ఉన్నవారు పలువురు వీరి నివాసానికి వచ్చి, వెళుతుండేవారు. గుజరాత్‌లోని వడోదరా జిల్లాలో 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న వీరి ఫామ్‌హౌస్‌ ప్రత్యేక పార్టీలకు ప్రతీతి. రాజకీయ నాయకులు, అత్యున్నతస్థాయి అధికారులు, సినిమా నటులను మాత్రమే ఈ పార్టీలకు ఆహ్వానించేవారు. సిబిఐకి చెందిన మాజీ అత్యున్నత అధికారి ఆర్‌కె ఆస్తానా కూతురి వివాహం కూడా ఈ ఫామ్‌హౌస్‌లోనే జరిగింది. ఆ కుటుంబం విదేశాలకు పారిపోయిన తర్వాత దొరికిన డైరీల్లో.. పలువురు ఉన్నతస్థాయి అధికారులకు, రాజకీయ నేతలకు డబ్బులిచ్చినట్లు రాసి ఉంది. ఆర్‌.ఏ పేరుతో జరిగిన చెల్లంపులు ఆస్తానాకు ఇచ్చినవే అన్న వార్తలు కూడా కొంతకాలం వచ్చాయి. అయితే, దీనిని అధికారులు ఖండించారు. వీరిలో ఎవరు ఉప్పందించారో తెలియదు. కానీ, పక్షులు ఎగిరిపోయాయి.
 

                                                                               తీగలాగితే..

దొంగే... దొర !

 

దొంగే... దొర !

   

    అనుకోకుండా దొరికిన తీగను లాగితే సందేసరా కుటుంబాల అక్రమాల డొంక కదిలింది. 2011వ సంవత్సరంలో ఆదాయపన్ను శాఖ గుజరాత్‌లోని ఫార్మాస్యూటికల్‌ పరిశ్రమలపై దాడులు నిర్వహించింది. యాధృచ్ఛికంగా జరిగిన ఈ దాడుల్లో 220 కోట్ల రూపాయలు లెక్కల్లోకి రాని సందేసరా కుటుంబ సంపద వెలుగులోకి వచ్చింది. ఐటి అధికారులు కూడా దీనిని తీవ్రంగా తీసుకోలేదు. ఆ మొత్తానికి పన్ను కట్టాలంటూ ఒక నోటీసు ఇచ్చి ఊరుకున్నారు. ఇది వెలుగులోకి వచ్చిన మొదటి అక్రమం! ఆ తరువాత ఒకదాని వెంట ఒకటిగా అక్రమాలు బయటకు వస్తూనే ఉన్నాయి. 2012లో స్టెర్లింగ్‌ బయోటెక్‌ సంస్థ ఇచ్చిన 58 కోట్ల రూపాయల చెక్‌ బౌన్స్‌ అయ్యిందంటూ స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ మైసూర్‌ క్రిమినల్‌ కేసు పెట్టింది. ఇది సందేసరా కుటుంబంపై నమోదైన మొదటి క్రిమినల్‌ కేసు. ఆ సంవత్సరంలోనే కాలపరిమితి ముగిసిన ఫారిన్‌ కరెన్సీ కన్వర్టబుల్‌ బాండ్స్‌కు నగదు చెల్లించడంలో విఫలమయ్యారంటూ బ్రిటన్‌లో కేసులు నమోదయ్యాయి. వీటి విలువ సుమారు 1,000 కోట్ల రూపాయలు. ఆ తరువాత రెండు, మూడు సంవత్సరాల్లోనే బ్యాంకులకు చెల్లించాల్సిన 5,000 కోట్ల రూపాయలను ఆ సంస్థ ఎగవేసింది. దీంతో ఆ మొత్తాన్ని నిరర్ధక ఆస్తులుగా బ్యాంకులు ప్రకటించాయి. దీంతో గగ్గోలు రేగింది. 2017 అక్టోబర్‌లో సిబిఐ సందేసరా గ్రూపునకు చెందిన ఉన్నతస్థాయి యాజమాన్యంపై మనీ లాండరింగ్‌ యాక్ట్‌ ప్రకారం కేసు నమోదు చేసింది. సందేసరా సోదరులతో పాటు ఆంధ్రాబ్యాంకు డైరెక్టర్‌గా పనిచేసిన చేతన్‌ సందేసరా భార్య దీప్తితో పాటు గుర్తు తెలియని ప్రైవేటు వ్యక్తులు, పలువురు అధికారులు నిందితులుగా ఉన్నట్లు సిబిఐ పేర్కొంది. చిత్రమేమిటంటే ఈ కేసు నమోదు కావడానికి కొన్ని నెలల ముందే 2016, డిసెంబర్‌లో సందేసరా కుటుంబం సపరివార సమేతంగా భారతదేశాన్ని వదిలి వెళ్లిపోయింది. 'వాళ్లు వెళ్లిపోయారు..' అని వారి ఇళ్ల వద్ద ఉన్న సిబ్బంది ఆ తరువాత కాలంలో దర్యాప్తు అధికారులకు చెప్పారు. సిబిఐ తరువాత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ కూడా రంగంలోకి దిగి, కేసు నమోదు చేసింది. కానీ ఫలితం...!?

       

                                                              వ్యూహాత్మకంగా ... మూడు దేశాల్లో

దొంగే... దొర !

    స్వదేశంలో ఎప్పటికైనా ముప్పు తప్పదని భావించడంతో సందేసరా కుటుంబం మొదటి నుండి వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఎగవేతదారులకు స్వర్గంగా భావించే అల్బేనియా, నైజీరియా వంటి దేశాల్లో పెట్టుబడులు పెట్టింది. వారి సంపదను మొత్తం ఆ దేశాలకు తరలించింది. ఈ భారీ పెట్టుబడులకు ప్రతిఫలంగా అల్బేనియా దేశాధ్యక్షుడు వారికి స్వయంగా పౌరసత్వాన్ని మంజూరు చేశారు. 2018, ఫిబ్రవరిలో పాస్‌పోర్టులు ఇచ్చారు. 2016లో దేశాన్నీ వీడిన వీరి ఆచూకీని అప్పటి వరకు మన దర్యాప్తు సంస్థలు గుర్తించకపోవడం చిత్రమే! భారతదేశంలో వేల కోట్ల రూపాయలు ఎగవేసిన వారికి అల్బేనియా పౌరసత్వం ఇచ్చిందంటూ మీడియాలో వార్తలు వచ్చిన తరువాత దర్యాప్తు సంస్థల్లో కదలిక ప్రారంభమైంది. నైజీరియా ప్రభుత్వం స్వయంగా గౌరవ కన్సల్టెంట్‌గా నితిన్‌ సందేసరాను నియమించుకుని, కుటుంబ సభ్యులందరికీ పౌరసత్వం ఇచ్చింది. కొసావోలోనూ వీరు పెట్టుబడులు పెట్టారు. అక్కడి ప్రభుత్వం నైజీరియాకు చెందిన ప్రముఖ కార్పొరేట్‌ కుటుంబంగా వీరిని అభివర్ణించింది. అక్కడితో ఆగకుండా కోసావా రాజకీయాల్లోనూ వీరు జోక్యం చేసుకుంటున్నారు. కొసావోను స్వతంత్ర దేశంగా గుర్తించాలని నైజీరియా ప్రభుత్వంపై ప్రస్తుతం వీరు ఒత్తిడి తీసుకువస్తున్నారు.

                                                                      మన దేశమూ కస్టమరే..!

దొంగే... దొర !

    మన ప్రజల సొత్తును దిగమింగి, విదేశాలకు పారిపోయినప్పటికీ వీరి వాణిజ్య కార్యక్రమాలకు మన దేశం ఇంకా వినియోగదారునిగా కొనసాగుతుండటం దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. కానీ, ఇది నిజం. నైజీరీయాలో సందేసరాలు 'సీప్కో' పేరుతో క్రూడాయిల్‌ కంపెనీని ఏర్పాటు చేశారు. మన దేశానికి చెందిన ప్రభుత్వరంగ సంస్థలు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌, హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ ఆ సంస్థ నుండి ఇప్పటికీ ముడి చమురును కొనుగోలు చేస్తున్నాయి. ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా ఈ సంస్థలు సీప్కోతో లావాదేవీలను నిర్వహించినట్లు సమాచారం. ఈ లావాదేవీలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

                                                                             ముగింపు కాదు...కానీ..

దొంగే... దొర !

    సందేసరా కుటుంబం ఎగవేతల గురించి మన న్యాయస్థానాల్లో జరిగిన వాదోపవాదాల సందర్భంగా ఆ కుటుంబానికి ఉన్న అత్యున్నత పరిచయాలను ప్రస్తావిస్తూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ 'ఆ స్థాయిలో పరిచయాలున్నవారు పారిపోయారనడం హాస్యాస్పదం' అని వ్యాఖ్యానించారు. ఆ కుటుంబాన్ని అప్పగించాలంటూ భారత దర్యాప్తు సంస్థలతో పాటు ఇంటర్‌ పోల్‌ ఏజెన్సీలు చేసిన విజ్ఞప్తులపై నైజీరియా, అల్బేనియా కోర్టుల్లో విచారణ జరిగింది. నైజీరియా న్యాయమూర్తి ప్రశాంత్‌ భూషణ్‌ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. 'భారత ప్రభుత్వం రాజకీయ కారణాలతోనూ, మతపరమైన అంశాలతోనూ గౌరవ కుటుంబీకులైన సందేసరాలను వేధిస్తోంది' అని ఆయన అన్నారు. అల్బేనియా న్యాయమూర్తి 'డబ్బులు ఎగ్గొట్టి, పరారుకావడం అంటే, దొంగతనం చేయడమే. అదే నిజమైతే భారత ప్రభుత్వరంగ సంస్థలు వేల కోట్ల రూపాయల వ్యాపారాన్ని ఆ కుటుంబంతో ఇంకా ఎలా చేస్తున్నాయి?' అని ప్రశ్నించారు. సందేసరా కుటుంబం నిర్వహిస్తున్న ఆయిల్‌ వ్యాపారానికి మన ప్రభుత్వరంగ సంస్థలు విలువైన వినియోగదారులుగా ఇంకా కొనసాగుతుండటాన్ని ఆయన ప్రస్తావించారు. రెండు దేశాలు అ కుటుంబసభ్యులను భారత్‌కు అప్పగించడానికి తిరస్కరించాయి. ప్రస్తుతానికైతే సందేసరాలు అల్బేనియా, నైజీరియాలకు చెందిన 'గౌరవనీయులైన కార్పొరేటే' ్ల! వారిని ఎలాగైనా స్వదేశానికి రప్పించి, కఠినంగా శిక్షిస్తామని మన దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. చూద్దాం.. ఏం జరుగుతుందో!!

దొంగే... దొర !

పొగడ దొరువు
73821 68168